కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈనెల 26 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ 18 రాష్ట్ర మహాసభలును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్,కేసి. బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలోని హోచిమిన్ భవన్‌లో దీనికి సంబంధించిన పోస్టర్లను అవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు నోయిడాలో కార్మికుల ఆందోళన కార్యక్రమాలు చూసైనా కళ్ళు తెరవాలన్నారు మహాసభలలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు చేసి చర్చిస్తామని, రాబోయే కాలంలో కార్మికవర్గ పోరాటలకు దిశానిర్దేశం చేయడానికి దోహదపడుతాయన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటిస్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని అన్నారు. కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మద్దిలేటి, జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, నగర అధ్యక్షులు మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు.


