వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

వల్లూరు: పుష్పగిరి శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా పూజలు జరిపారు. ఉదయం స్వామి వారికి విశ్వక్సేన పూజ, పంచామృతాభిషేకం జరిపారు. వివిధ రకాల పరిహారాల కోసం బింబశుద్దితో 108 కళశాలను ఏర్పాటు చేసి వివిధ నదుల్లో ని పుణ్య జలాలలతో, విశేష ద్రవ్యాలతో, ఆవు పాలు, నెయ్యి, తేనె,గంధోధకంతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కళశాలలోని ద్రవ్యాలతో శ్రీ దేవి, భూదేవి సమేత చెన్న కేశవ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ చెన్న కేశవ స్వామి యాళీ వాహనంపై కొలువు దీరగా మంగళ వాయిద్యాల నడుమ దివిటీల వెలుగులో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

– శ్రీ వైద్యనాఽథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహించారు. రాత్రి శ్రీకామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామిని పురుషాన్‌ మృగ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నేడు చందనోత్సవం: బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి చందనోత్సవం జరుగుతుంది. రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. రాత్రి శ్రీ వైద్యనాథ స్వామికి మయూర వాహన సేవ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement