మైలవరం : హలం పట్టి పొలం దున్ని చెమటోడ్చి పని చేస్తూ పిల్లలను చదివిస్తున్న ఓ కన్నతండ్రి కష్టానికి సార్థకత చేకూర్చింది ఆ పల్లెటూరి అమ్మాయి. తల్లిదండ్రులు తనపై ఉంచిన బాధ్యతను చిన్నవయసులోనే గుర్తెరిగి శ్రద్ధతో చదివి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 99 శాతం మార్కులను సాధించింది. కన్నవారి కలలను సాకారం చేసే దిశగా తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితాన్ని అందించి పెద్దల ఆశలకు ఒకింత రూపునిచ్చింది. మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన వెంపలాకు పెద్దిరాజు కుమార్తె లక్ష్మీ ప్రణీత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 455 మార్కులకుగాను 451 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తనను చదివిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తెరిగిన.. ఆ అమ్మాయి అహర్నిశలు కష్టపడి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును చేరుకోగలిగింది. ఆంగ్లంలో మూడు మార్కులు, సంస్కృతంలో ఒక మార్కు కోల్పోయిన ఆ విద్యార్థిని గ్రూపు సబ్జెక్టుల్లో వంద శాతం మార్కులను సాధించింది. వైద్యవిద్యలో సీటు సంపాదించి పల్లె సీమల్లో ఉచిత సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని లక్ష్మీ ప్రణీత గట్టి విశ్వాసంతో చెబుతోంది. వాస్తవానికి ఆమె తండ్రి పెద్దిరాజు కూడా డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని ఉన్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ కష్టపడి పిల్లలను చదివిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం పెద్ద కుమార్తె లక్ష్మీప్రణీత తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని అందించి చెల్లికి, తమ్మునికి ఆదర్శంగా నిలిచింది. ఉత్తమ మార్కులు సాధించి కుటుంబానికి ఆనందాన్ని మిగిల్చింది.
ఇంటర్మీడియట్‌లో
విద్యార్థిని విశేష ప్రతిభ
తండ్రి కష్టాన్ని గుర్తెరిగి చదివిన పల్లెటూరి అమ్మాయి
రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు


