పంట ఏదైనా రైతన్న కంట కన్నీరొలుకుతూనే ఉంది.. సాంప్రదాయ పంటలే కాదు ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసినా నష్టమే పలకరిస్తోంది. చేసిన కష్టమంతా చేలోనే బూడిదవుతోంది. జిల్లాలో మిరప సాగు చేసిన రైతన్నలదీ ఇదే పరిస్థితి. తెగుళ్ల దెబ్బకు మిర్చి ఘాటు చిన్నబోయింది. ఓ వైపు దిగు బడి రాక.. గిట్టుబాటు కాక.. మరోవైపు ప్రభు త్వం నుంచి భరోసా దక్కక మిరప రైతు జీవితం కష్టాలమయమైంది..
● భారీగా తగ్గిన దిగుబడి
● నష్టాలతో మిరప రైతు కుదేలు
● ఆదుకోని కూటమి ప్రభుత్వం
సిద్దమూర్తిపల్లె వద్ద సాగులో ఉన్న మిరప పంట
ముడత తెగులు సోకిన మిరప పంట
కలసపాడు: మిరప సాగు చేసిన రైతులు కుదేలయ్యారు. కష్టనష్టాలకోర్చి పైరు సాగు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా తెగుళ్లతో భారీగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో మిరప రైతుకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. మిరప రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది మిరప రైతులు భారీ నష్టాలు మూట కట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో మిర్చి సాగైంది. ఒక్క కలసపాడు మండలంలో 37.8 ఎకరాలలో రైతులు మిరప సాగు చేశారు. మండలంలోని కొత్తకోట, పెండ్లిమర్రి, మహానందిపల్లె, మామిళ్లపల్లె, సిద్దమూర్తిపల్లె తదితర గ్రామాల్లో రైతులు మిరప సాగు చేశారు. మిరప విత్తనాల నుంచి పైరు సాగు వరకు ఒక ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఇప్పటివరకు రైతులు ఖర్చు చేశారు. కానీ పైరు ఎదుగుదల లేకుండా పూత, కాయలు లేకుండా పోయాయి. మిరప పంటకు సోకిన నల్లి వల్ల వారానికి రెండు సార్లు రైతులు పురుగు మందులు పిచికారి చేసినా పైరు ఎదుగుదల లేకుండా పోయింది. ఏప్రిల్ నెల ముగుస్తున్నప్పటికీ పైరులో ఎటువంటి ఎదుగుదల లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సగం పెట్టుబడి కూడా రైతుకు అందే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో పైరు సాగుచేసిన రైతులకు ప్రభుత్వం పంటలు బీమా మంజూరు చేసేది. కాని ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎటువంటి పంటల బీమా మంజూరు చేయకపోవడం, నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయకపోవడంతో రైతులకు ఎటువంటి ఆసరా లేకుండా పోయింది. దీంతో మిరప రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుని పైర్ల సాగుపై అనాసక్తి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది.
5 ఎకరాలు సాగు చేశాను
నేను 5 ఎకరాలలో మిరప పంట సాగు చేశాను. ఎకరాకు ఇప్పటివరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశాను. కానీ దిగుబడి గత ఏడాది కన్నా సగం తగ్గిపోయింది. మిరప రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎనుముల అనిల్‌రెడ్డి,
రైతు, ఎగువ రామాపురం, కలసపాడు మండలం
తీవ్రమైన తెగుళ్లు
ఈ ఏడాది మిరప పైరుకు తీవ్రమైన తెగుళ్లు ఏర్పడ్డాయి. వారానికి రెండుసార్లు మందులు పిచికారీ చేసి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చుచేసినాం. అయినా రైతుకు పెట్టుబడి దక్కే పరిస్థితి కూడా లేదు. – నాగిరెడ్డి జయరామిరెడ్డి,
రైతు, పెండ్లిమర్రి, కలసపాడు మండలం


