కడప అగ్రికల్చర్ : గ్రామీణ రైతాంగానికి వెన్నెముక అయిన సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్ కోరారు. సహకార రంగం బలోపేతానికి బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ సహకార రంగంలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగానికి ఇచ్చే రుణాలపై వడ్డీ తగ్గాలంటే సహకార వ్యవస్థలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి వ్యవసాయ పరపతి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాత్ర ఈ నెల 18వ తేదీన తిరుపతి, నెల్లూరు మీదుగా ఒంగోలులో ముగియనున్నట్లు తెలియజేశారు. ఈ యాత్రలో వివిధ జిల్లాల నుంచి హాజరైన అసోసియేషన్ ప్రతినిధులతోపాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు గంటా నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, జిల్లా నాయకులు వీరబ్రహ్మం, సుధాకర్‌రెడ్డి, సహకార ఉద్యోగులు పాల్గొన్నారు.


