పంచాయతీ వేలం పాటలో కూటమి పోటాపోటీ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ వేలం పాటలో కూటమి పోటాపోటీ

Apr 18 2026 8:29 AM | Updated on Apr 18 2026 8:29 AM

బీజేపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఆధిపత్య ధోరణి

ఐదింతలు పెరిగిన బస్టాండు ఆదాయం

ముద్దనూరు : బీజేపీ, టీడీపీ వర్గీయుల మధ్య విభేదాలతో గ్రామ పంచాయతీ వేలంపాట మున్సిపాలిటీ స్థాయిని మించిపోయింది. కూటమిలోని ఇరు పార్టీల వారు తమకే దక్కాలని ప్రతిష్టగా తీసుకోవడంతో.. పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా వేలంపాట సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన పాట 3 గంటల వరకు సాగింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి వర్గీయులు పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు. సర్కారు వారి పాట రూ.9లక్షల12వేల నుంచి మొదలు కాగా పోటాపోటీగా పాడి రూ.40 లక్షల వరకు తీసుకెళ్లారు. ఇక ముగింపు ఉండదని గ్రహించిన డీఎల్‌పీవో నూర్జహాన్‌ చివరకు ఒక నిమిషం సమయంలో ఎవరు ఎక్కువ పాట పాడితే వారికే కాంట్రాక్ట్‌ దక్కుతుందని పేర్కొన్నారు. దీంతో బస్టాండు వేలంపాట రామాంజినేయులు రూ.42లక్షల63వేలకు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన జంతువధశాల వేలంపాటను కూడా పోటాపోటీగా పాడి సుబ్బరత్నమ్మ రూ.12లక్షల77వేలకు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు పంచాయతీలో బస్టాండు వేలంపాట గరిష్టంగా రూ.11 లక్షల వరకు సాగింది. గత ఏడాది కూడా రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. అయితే కూటమిలో అంతర్గత పోరుతో వేలంపాట ఐదింతలు దాటింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల మేరకు వేలంపాట పొందిన కాంట్రాక్టర్‌ 7 రోజుల్లోగా అంటే ఈ నెల 24వ తేదీ నాటికి వేలం పాట మొత్తాన్ని పంచాయతీకి చెల్లించి వసూళ్లకు దిగాలని, లేకుంటే వేలంపాటలో చెల్లించిన డిపాజిట్‌ రూ.6 లక్షలు తిరిగి చెల్లింపు ఉండదని పేర్కొన్నారు. రూ.42 లక్షల 63 వేలకు వేలం పాట పాడటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధాకృష్ణవేణి, డిప్యూటీ ఎంపీడీవో వీరభద్రుడు పాల్గొన్నారు.

భారీగా బందోబస్తు

స్థానిక గ్రామ పంచాయతీ వేలం పాట నిర్వహణ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు ఎన్నికల బందోబస్తును తలపించింది. ముందు జాగ్రత్త చర్యగా వేలంపాట జరిగే గ్రామపంచాయతీ కార్యాలయం రహదారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రహదారి వెంట మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం, ఈ మార్గంలో వున్న చిరుదుకాణాలు, కూరగాయల మార్కెట్‌ మూసివేయడం, ప్రజల రాకపోకలు కూడా బంద్‌ కావడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ముద్దనూరు సీఐ నగేస్‌బాబు, కొండాపురం సీఐ రాజతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు, 30 మంది కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ రహదారి అంతా నిర్మానుష్యంగా మారింది. దశాబ్దాల తరబడి వేలంపాటలు నిర్వహిస్తున్నా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేలం పాట సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement