కమలాపురం : కమలాపురంలో ఎల్లమ్మ(హేలాంబ) తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోట రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ క్యాటగిరి వృషభ రాజములకు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతి రూ.1.20 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1 లక్ష, తృతీయ బహుమతి రూ.80 వేలు, నాల్గవ బహుమతి రూ.60 వేలు, ఐదవ బహుమతి రూ.50 వేలు, ఆరవ బహుమతి రూ.40 వేలు, ఏడవ బహుమతి రూ.30 వేలు, 8వ బహుమతి రూ.25 వేలు, 9వ బహుమతి రూ.20 వేలు, పదవ బహుమతి రూ.15 వేలు, 11వ బహుమతి రూ.10 వేలు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన వారు ఆలయ ప్రాంగణంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
రాత్రి నాటకాల ప్రదర్శన
భక్తుల కాలక్షేపం కోసం రాత్రి నాటకాల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రామాంజనేయ యుద్ధ సన్నివేశం, చింతామణి భవానీ సీను, గయోపాఖ్యానం(యుద్ధసీను), సత్య హరిశ్చంద్ర నుంచి వారణాసి, కాటి సీను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు తిలకించాలని వారు కోరారు. మండల పరిధిలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన కీ.శే. ఓబులాపురం జనార్ధన్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి సుజాత, తనయులు శ్యాం సుందర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, కుమార్తె డాక్టర్ మాధవిరెడ్డి భక్తుల సౌకర్యార్థం మూడు పూటల అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండిబజారు వీధిలో గోనె సంచుల షాపులో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది సుబ్బరాజు, శివయ్య, రామకృష్ణ, చంద్రశేఖర్, సురేష్ శుక్రవారం దాడులు నిర్వహించారు. 31 బ్యాగుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సుబ్బారెడ్డి, ఆషిద్ రెహమాన్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
‘అల్ట్రాటెక్’ వద్ద
కొనసాగిన నిరసన
సాక్షి ట్రాస్కఫోర్సు : ఎర్రగుంట్ల మండల పరిధి చిలంకూరు గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు చేస్తున్న నిరసన మూడో రోజుకు చేరింది. శుక్రవారం ఫ్యాక్టరీలోకి విధులకు వెళ్తున్న కార్మికులను శిబిరం వద్ద ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విధుల్లోకి పోకుంటే తమకు ఇబ్బందులు వస్తాయని కార్మికులు సీఐ విశ్వనాథ్‌రెడ్డితో చెప్పుకొన్నారు. పోలీసులు ఇరు వర్గాల వారితో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. కాగా ఆందోళనకారులతో పరిశ్రమ యజమాన్యం ఇప్పటి వరకు చర్చలకు రాకపోవడంతో.. శిబిరం శనివారం కూడా కొనసాగే అవకశాం ఉందని కూటమి శ్రేణుల ద్వారా తెలుస్తోంది. తాము వీధులకు వెళ్లాలని చూస్తున్నా అక్కడ ఉన్న ఆందోళనకారులు లోనికి పోనివ్వడం లేదని కొందరు కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమకు వెళ్లే దారులన్నింటినీ ఆందోళనకారులు అడ్డగించారు. దీంతో పరిశ్రమలో మూడు రోజు కూడా మొత్తం పనులన్నీ నిలిచిపోయాయి.


