ఒంటిమిట్ట : ఏప్రిల్ 1న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి బద్వేలు నుంచి విచ్చేసిన సుధామణి అనే మహిళ మెడలోని బంగారు తాలిబొట్టు సరుడును గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన వెలుగు చూసింది. బస్సు పార్కింగ్ పాయింట్ వద్ద తన మెడలోని 40 గ్రాముల బంగారు తాలిబొట్టు సరుడును లాక్కెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
బాలిక అదృశ్యం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టకు సమీపంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం అయినట్లు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు గురువారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీప బంధువులు, స్థానికులను విచారణ చేసినా ఆచూకీ తెలియరాలేదన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంఖాన్‌పల్లిలో వున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45– 50) మృతి చెందాడు. అతని చేతిపై క్రిస్తువేణి అనే పచ్చబొట్టు వుంది. అతని ఆచూకీ తెలిసిన వారు తమ దృష్టికి తీసుకుని రావాలని కడప తాలూకా సీఐ నరసింహరాజు తెలియజేశారు. ఫోన్ నంబర్లు: 9121100514, ఎస్‌ఐ 9121100516కు సమాచారం ఇవ్వాలని కోరారు.
షార్ట్ సర్క్యూట్‌తో కూలీ మృతి
బి.కోడూరు : మండలంలోని టమటంవారిపల్లె గ్రామ సమీపాన గల మెగా ఇంజినీరింగ్ ఇండస్ట్రియల్ లిమిటెట్ కంపెనీలో సబ్ కాంట్రాక్టు తీసుకుని ప్రియాన్స్ కంపెనీలో పని చేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జగదీష్ (38) అనే వ్యక్తి షార్ట్‌సర్క్యూట్‌తో శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జగ్‌దీష్ టమటంవారిపల్లె గ్రామ సమీపాన జరుగుతున్న కాంక్రీటు పనుల్లో భాగంగా క్యూరింగ్ చేసే పనుల్లో మోటార్ ఆన్ చేయబోయి షార్ట్‌సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అదే కంపెనీలో పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


