నకిలీ పత్రాలతో స్థలం కబ్జా | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో స్థలం కబ్జా

Apr 18 2026 8:29 AM | Updated on Apr 18 2026 8:29 AM

బద్వేలు అర్బన్‌ : స్థానిక సిద్దవటం రోడ్డులోని సత్యాటౌన్‌షిప్‌ సమీపంలో ఓ ప్లాట్‌కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసి విక్రయించిన ఇద్దరు నిందితులను శుక్రవారం అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ టి.వి.ఎన్‌.చిరంజీవి వివరాలు వెల్లడించారు. పోరుమామిళ్ళ పట్టణం గిరినగర్‌కు చెందిన చిరుకూరి శ్రీహరి తండ్రి పేరిట ప్లాట్‌ నంబర్‌ 422ను పట్టణంలోని సత్యాటౌన్‌షిప్‌ సమీపంలో కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది. ఆ తర్వాత శ్రీహరి తండ్రి మరణించడంతోపాటు శ్రీహరి విదేశాల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని అతని కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని కలసపాడు మండలం శంఖవరం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఓబులేసు ఎలాగైనా ఇంటి స్థలాన్ని కాజేయాలని పథకం రూపొందించారు. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీహరి అక్క నివాసం వద్దకు వెళ్లి మాటమాటలతో అసలు పత్రాలను దొంగలించాడు. అనంతరం కలసపాడు మండలం శంఖవరం గ్రామానికి చెందిన పగిడి బాలరాజుతోపాటు మరికొందరి సహకారంతో చనిపోయిన శ్రీహరి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి 2017లో నకిలీ సేల్‌ అగ్రిమెంటు సృష్టించి రూ.12 లక్షలకు ఆ స్థలాన్ని విక్రయించారు. నిందితులు స్థలంలో ఉన్న పునాదిని సైతం ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీహరి సంబంధిత స్థలాన్ని వెళ్లి పరిశీలించగా ఎవరో నిర్మాణం చేసి ఉండటాన్ని గమనించి అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్‌ ఎస్‌ఐ టి.వి.ఎన్‌.చిరంజీవి విచారణ చేపట్టగా నిందితులు శ్రీహరి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి గుట్టుగా విక్రయించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను అబ్బుసాహెబ్‌పేట క్రాస్‌రోడ్డు వద్ద అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అర్బన్‌ కానిస్టేబుళ్లు సిద్దారెడ్డి, ఓబులయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement