● మృతదేహం పూడ్చడానికి వచ్చిన దళితులు
● ఆలయ ఆవరణలో వద్దన్న నిర్వాహకులు
● ఎట్టకేలకు సమస్యను పరిష్కరించిన
అధికారులు
ఎర్రగుంట్ల : మండల పరిధి పోట్లదుర్తి గ్రామంలోని ఎస్సీ వర్గానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చడానికి వచ్చిన క్రమంలో దళితులు, గ్రామంలోని పెద్దలు, ఆలయ కమిటీ నిర్వహుకుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళితే... పోట్లదుర్తిలో పెద్దమ్మతల్లి దేవాలయం ఉంది. ఈ ఆలయ స్థలం విషయంపై గతంలో గ్రామంలో పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు జిల్లా కలెక్టర్ సైతం ఆలయాన్ని పరిశీలించి దేవదాయ శాఖ అధికారులతో మాట్లాడి చుట్టూ ప్రహరీ కట్టించారు. ఆ ప్రహరీ లోపల దళితుల శ్మశాన వాటిక ఉండేది. కానీ ఇప్పుడు దళిత కులానికి చెందిన నరసింహులు మృతి చెందడంతో మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చడానికి వచ్చారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు వచ్చి అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మృతదేహాన్ని ఏ విధంగా పూడ్చతారని వారు అన్నారు. తమ పూర్వీకుల నుంచి ఇక్కడే శ్మశాన వాటిక ఉండేదని దళితులు అన్నారు. అయితే ప్రహరీ కట్టే సమయంలో ఎందుకు అడ్డుకోలేదని నిర్వాహకులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తహసీల్దార్ అమరేశ్వరి, సీఐ విశ్వనాథరెడ్డిలు వారితో చర్చించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయట పూడ్చుకోవాలని, తర్వాత శాశ్వత శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయిస్తామని అధికారులు తెలపడంతో సమస్య సద్దమణిగింది.


