రైల్వేస్టేషన్లకు కొత్తకళ! | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లకు కొత్తకళ!

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

రైల్వేస్టేషన్లకు కొత్తకళ!

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్‌ భారత్‌ పథకం ద్వారా జిల్లాలోని కడప, రాజంపేట రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో అమృత్‌ భారత్‌ పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో ప్రయాణీకులకు మెరుగైన, ఆధునిక వసతులు కల్పనే పనులు ముమ్మరంగా చేస్తున్నారు.

వడివడిగా కొనసాగుతున్న పనులు

జిల్లాలోని కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకుగాను రాజంపేటకు రూ.5.53 కోట్ల, కడపకు రూ. 45 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. కడప రైల్వేస్టేషన్‌కు సంబంధించి ముఖద్వారం పునర్నిర్మాణం, రెండు, మూడు ప్లాట్‌ ఫారాల విస్తరణ చేస్తున్నారు. నీటి అవసరం మేరకు ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణం, ప్లాట్‌ఫాం మొత్తం గ్రానైట్‌ పరుస్తున్నారు. 40 అడుగుల మీటర్ల వెడల్పుతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ప్రయాణికుల నిరీక్షణ గదులు, విశ్రాంతి గదుల ఆధునికీకరణ, రాజంపేట మార్గం వైపు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, ప్రస్తుతం మొదటి ప్లాట్‌ఫాంలో మాత్రమే ఉన్న లిఫ్ట్‌ మిగిలిన చోట్ల కూడా ఏర్పాటు, రైళ్ల రాకపోకల గురించి తెలియజేసే డిజిటల్‌ బోర్డు, మెరుగైన లైటింగ్‌ సౌకర్యం, రెండవ ప్లాట్‌ఫాం పూర్తిగా కవరింగ్‌ పనులు చేపడుతున్నారు.

● రాజంపేట రైల్వేస్టేషన్‌కు సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆధునిక భవనాలు, ఆధునిక శైలితో ఫ్లోరింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ ఫాం పొడవును కూడా పెంచనున్నారు. స్టేషన్లలో రైలు పట్టాల పరిశుభ్రత కోసం బ్యాలస్ట్‌ లెస్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఇతర సదుపాయాలు ఉంటాయి. వెయిలింగ్‌ హాళ్లు, వాటికి అనుబంధంగా కేఫెటేరియా, స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్‌ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్‌ ప్లాజా, సమావేశ మందిరాలు నిర్మిస్తున్నారు. స్టేషన్‌కు రెండు వైపులా అప్రోచ్‌రోడ్లు, పార్కింగ్‌ ఏరియా, పాదాచారులకు ప్రత్యేక దారి, ల్యాండ్‌ స్కేపింగ్‌, ఆధునిక లైటింగ్‌, వేగవంతమైన వైఫే 5జీ టవర్లు ఏర్పాటు దిశగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.

స్వాగతిస్తున్న ప్రయాణికులు

కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. ఈ రెండు స్టేషన్ల నుంచి ప్రతినిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే ఆధునిక వసతులు సమకూరుతాయని ప్రయాణికులు భావిస్తున్నారు. గడువు కన్నా ముందే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ సాయంతో కడప,రాజంపేట స్టేషన్లకు నూతన హంగులు

ఆయా రైల్వేస్టేషన్లకు వరంగా మారినఅమృత్‌ భారత్‌ పథకం

డిసెంబరు నాటికి పనులుపూర్తి చేసేలా కసరత్తు

Advertisement
 
Advertisement
Advertisement