యూజ్ అండ్ త్రో..!
తమ్ముళ్లూ..
సాక్షి ప్రతినిధి, కడప: అవసరానికి వాడుకోవడం.. ఆపై మూలకు విసిరేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. పచ్చగా ఉన్నప్పుడు నెత్తినపెట్టుకోవడం.. పనయ్యాక పాతాళానికి తొక్కిపడేయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ‘యూజ్ అండ్ త్రో’ పాలసీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్.. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు. జిల్లా టీడీపీ నేతల విషయంలో ఈ విషయం మరోసారి రుజువైంది. ఎన్నికల సమయంలో ‘తమ్ముళ్లం’టూ ప్రేమ ఒలకబోసే చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక దగ్గరకు కూడా రానీయరు.. నాడు కందుల రాజమోహన్‌రెడ్డి, నేడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డిపై బాబు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా 1996లో తొలిసారి పోటీచేసిన కందుల రాజమోహన్‌రెడ్డికి టీడీపీలో ఎనలేని ప్రాధాన్యత లభించింది. కడప ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన రాజమోహన్ రెడ్డికి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించారు. పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడిగా కన్పించారు. తర్వాత కనుమరుగయ్యారు. తర్వాత 2009లో పోటీచేసిన పాళెం శ్రీకాంత్‌రెడ్డి ఇదే పరిస్థితి. తాజాగా రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డిదీ ఇదే దుస్థితి.
ఎన్నికల్లో వాడుకునేందుకు పదవులు
ఎన్నికల్లో వాడుకునేందుకే చంద్రబాబు పార్టీ పదవులు కట్టబెడతారని పలువురు వివరిస్తున్నారు. జిల్లా టీడీపీలో క్రేజ్ ఉన్న పుత్తా నరసింహారెడ్డిని నిన్నటివరకు రాష్ట్ర ఉపాధ్యక్షపదవిలో కొనసాగించారు. బుధవారం ప్రకటించిన కమిటీలో పుత్తాకు చోటు దక్కలేదు. నిన్నటివరకు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్ష పదవిలో కొనసాగించిన అమీర్‌బాబుకు పంగనామాలు పెట్టారు. ఇక మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిదీ అదే పరిస్థితి. ఎంచక్కా ఎన్నికల్లో వాడుకొని ఆపై పక్కనపెట్టేశారు. దేవగుడి కుటుంబం కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్న సందర్భంలో జంబాపురం రమణారెడ్డి స్థానికంగా టీడీపీలో ప్రత్యర్థిగా నిలిచారు. రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన్ను కూడా తప్పించారు. సందర్భాన్ని బట్టి వాడుకొని వదిలేయడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది అందవేసిన చేయిగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
సామాజిక సమీకరణలో
హరిప్రసాద్, ముక్తియార్‌కు చోటు
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా బాలిశెట్టి హరిప్రసాద్, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిలకు అవకాశం దక్కింది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీఎస్ ముక్తియార్ చోటు దక్కింది. సామాజిక సమీకరణలో భాగంగానే ఆ ముగ్గురికి ఆయా పదవులు లభించినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలాగే కార్యనిర్వహక కార్యదర్శిగా ఎస్ గోవర్ధన్‌రెడ్డి తిరిగి కొనసాగించారు. మైదుకూరుకు చెందిన మునిశేఖరరెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా బద్వేల్ నుంచి సుధాకర్‌లకు కూడా జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో చోటుదక్కింది.
పలువురు టీడీపీ నేతలకుపార్టీ పదవులు ఊస్టింగ్
వాసుకు డిమోషన్...
రాష్ట్ర కార్యవర్గం నుంచి పుత్తా, మల్లేల, జంబాపురం, వీఎస్ ఔట్
ఎన్నికల్లో వాడుకొనివదిలేస్తున్న చంద్రబాబు


