వల్లూరు: జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుష్పగిరి క్షేత్రం చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శివ స్వరూపుడైన వైద్యనాధేశ్వరునికి ,విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన పుష్పగిరిలో శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయాల్లో బుధవారం జరిగిన అంకురార్పణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
● బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ సాక్షాత్తూ శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి ముందుగా పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్న కేశవునికి పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 19వ తేదీన జరిగే చందనోత్సవానికి, 20న అక్షతదియలో భాగంగా జరిగే గరుడవాహన సేవకు, 21 న జరిగే రెండు కల్యాణోత్సవాలకు , 22 న జరిగే రెండు రథోత్సవాలకు, బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన 23వ తేదీన జరిగే చక్రస్నానం, పుష్పయాగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.


