అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

కడప అర్బన్‌: అనుమతి లేకుండా మద్యం క్రయ విక్రయాలు చేయడం, వాటికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలు (బెల్ట్‌ షాపులు), నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. దాడుల్లో మొత్తం సుమారు రూ.1,60,000 విలువైన 578 క్వార్టర్‌ బాటిళ్ల మద్యం, 115 లీటర్ల నాటుసారా, 10 బీర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 కేసులు నమోదు చేసి 37 మందిని అరెస్టు చేశామన్నారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలంలోని గుండాపురం ఎస్సీ కాలనీకి చె ందిన పాణ్యం శ్రీహరి (35) జీవనోపాధి కోసం హైదరాబాదుకు వెళ్లాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో హైదరాబాదులో తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులు తీరకపోగా వడ్డీలు పెరగడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి

కడప అర్బన్‌: ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ. 59,325 జరిమానా విధించామని ఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించాలని సూచించారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరమని , రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుర్తుతెలియని వాహనం

ఢీ కొని వ్యక్తి మృతి

రాజంపేట: రాజంపేట–రాయచోటి రహదారిలోని బ్రహ్మణపల్లె సబ్‌స్టేషన్‌ వద్ద డీ.శివ(30) అనే వ్యక్తి బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు. బ్రహ్మణపల్లె నుంచి రాజంపేటకు స్కూటీలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తిరుపతి జిల్లా ఏర్పేడు రాచగన్నేరు సబ్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి మన్నూరు పోలీసులు చేరుకొని మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బెల్టుషాపుపై పోలీసులు దాడి

రాజంపేట: పట్టణంలోని రాజంపేట బైపాస్‌రోడ్డు(ఉస్మాన్‌నగర్‌)లో అక్రమంగా మద్యం అమ్ముతున్న ప్రాంతంపై బుధవారం అర్బన్‌ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నాగార్జున తెలిపారు. బోయభీమారాముడు, చిన్నవీరన్నలను వేర్వేరు చోట్ల అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 81బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement