వల్లూరు: కడప– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన వల్లూరు మండల పరిధిలోని ఏ ఓబాయపల్లె క్రాస్ వద్ద ఈ నెల 8 వ తేదీ రాత్రి జరిగిన కొప్పుల సుబ్బయ్య హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ ఆర్ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎస్‌ఐ శివనాగిరెడ్డితో కలిసి వల్లూరు పోలీస్ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. మండలంలోని ఏ ఓబాయపల్లెకు చెందిన కొప్పుల సుబ్బయ్యకు అదే గ్రామానికి చెందిన నిందితులైన మద్దెల రాజేష్, మద్దెల మోహన్ రంగా, మద్దెల రఘురాంలకు మధ్య వున్న కుటుంబ విషమైన తగాదాల కారణంగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సుబ్బయ్యపై కక్ష పెంచుకున్న రాజేష్, మోహన్ రంగాలు ఈ నెల 8 వ తేదీన రాత్రి వల్లూరులోని మద్యం షాపు వద్ద సుబ్బయ్యతో గొడవ పడ్డారు. అనంతరం ఇంటికి వచ్చి మద్దెల రఘురాం ప్రోత్సాహంతో ఏ ఓబాయపల్లె క్రాస్ వద్ద సుబ్బయ్యను మచ్చుకత్తులతో నరికి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ మోహన్, ఎస్‌ఐ శివ నాగిరెడ్డి బుధవారం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.


