కడప అర్బన్: జిల్లాలో రౌడీయిజం ఎక్కడా ఉండకూడదని, రౌడీల ఆట కట్టించి శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని, మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవనే హెచ్చరిక ప్రజల్లోకి వెళ్లాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమంగా మద్యం విక్రయించే (బెల్ట్) షాపులపై కఠినంగా వ్యవహరించాలని, విస్తృతంగా దాడులు చేసి పట్టు బడ్డ వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు సబ్ – డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి కదలికలపై నిఘాపై ఉంచి సమాచారముంటే నేరం చేయకముందే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐ.పీ.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో బెట్టింగ్ కేసుల్లో ఉన్న కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. భూ వివాదాలు, ఆర్ధిక పరమైన అంశాల వలన క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని పరిశీలించి కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. లాడ్జిలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని, వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ, సబ్ డివిజన్ లోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


