ఉప్పుటూరు వాసి కువైట్‌లో మృతి | - | Sakshi
Sakshi News home page

ఉప్పుటూరు వాసి కువైట్‌లో మృతి

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

అట్లూరు : మండల పరిధిలోని అట్లూరు పునరావాస కాలనీ ఉప్పుటూరు కాలనీకి చెందిన పోతిరెడ్డి అబ్బిరెడ్డి (40) బుధవారం కువైట్‌లో బిల్డింగ్‌పై నుంచి కింద పడి మృతి చెందినట్లు మృతుని బంధువులు, కాలనీ వాసులు తెలిపారు. స్థానికుల వివరాల మేరకు అబ్బిరెడ్డి పదేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత వచ్చి భార్యను కువైట్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఒక కుమార్తె కూడా జన్మించింది. కుమార్తె, భార్యను ఇటీవల ఇండియాకు ఆయన పంపించారు. అయితే అక్కడ బిల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అబ్బిరెడ్డి దినచర్యలో భాగంగా బుధవారం కువైట్‌లోని ముతల్లా అనే ప్రాంతంలో పనిచేస్తూ నాలుగు అంతస్తుల పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భర్త మృతి చెందడంతో భార్యతోపాటు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని ఇండియాలోని స్వగ్రామానికి పంపించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రైలు కింద పడి వృద్ధురాలు..

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కమలాపురం మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన జి.లింగమ్మ (86) అనే వృద్ధురాలు రైలు కింద పడి మృతి చెందింది. కమలాపురం–ఎర్రగుడిపాడు మధ్య గుర్తు తెలియని రైలు కింద పడి లింగమ్మ మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

మద్యం బాటిళ్లు స్వాధీనం

కొండాపురం: మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమ మద్యం విక్రయాల పై బుధవారం దాడులు చేయగా చామలూరు గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి వద్ద 250 క్వార్టర్‌ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాథ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు 250 క్వార్టర్‌ బాటిళ్లు కేరళ మాల్ట్‌ విస్కీమద్యం అక్రమంగా విక్రయాలు చేస్తుండగా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అక్రమంగా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం విక్రయదారుడుని రిమాండ్‌కు తరలించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement