పులివెందుల : ఇటీవల సోషల్ మీడియాలో బీఎస్ రెడ్డి అనే ఫేస్ బుక్ యూజర్, ఎం9 న్యూస్, థింక్ అంధ్ర అనే మీడియా చానెళ్లలో తమ సోషల్ మీడియా ఖాతా, ఫేస్‌బుక్ ఖాతా ద్వారా మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులపై, పార్టీకి సంబంధించి అసభ్యకరమైన, అవమానకరమైన, తప్పుడు ఆరోపణలతో కూడిన పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హఫీజ్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, వైఎస్సార్‌సీపీ నాయకులు రసూల్, చంద్రమౌళి, కనక, శివ, కార్తీక్, భాస్కర్‌రెడ్డి, జహిర్ అహ్మద్, కలందర్, హృషికేశవరెడ్డి, పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాయకుల గౌరవానికి, మా మనో భావాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా పోస్టులు ఉన్నాయని, సమాజంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ వర్గాలలో ద్వేషం, ఉద్రిక్తతలు రేకెత్తించే విధంగా ఉన్నాయన్నారు. ఈ చర్యలు వివిధ సెక్షన్లకు లోబడి ఉన్నాయని, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై, మీడియాపై వెంటనే కేసు నమోదు చేసి ఆ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు విన్నవించారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసులకు వైఎస్సార్‌సీపీ
నాయకుల ఫిర్యాదు


