● పలువురి శరీరాల్లో తేనెటీగల ముళ్లు
● చికిత్స కోసం ఆసుపత్రుల బాట
రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లా కూచివారిపల్లె గ్రామస్తులపై తేనెటీగలు దాడిచేశాయి. ఆరుబయట ఉంటే సైర్వవిహారం చేశాయి. కంటికి కనిపించిన వారినల్లా కుట్టేశాయి. గుంపులుగా రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలువురి శరీరాల్లో తేనెటీగల ముళ్లు గుచ్చుకొని గాయాలబారిన పడ్డారు. చికిత్స కోసం రాజంపేట, తిరుపతి ఆసుపత్రుల బాట పట్టారు. ఈ సంఘటనలో 25 మంది గాయపడినట్లు స్ధానికులు చెబుతున్నారు. కొందరైతే శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి, కాపాడుకోనే ప్రయత్నాలు చేశారు.
ఆరుబయట తెచ్చిన తంటా..
భానుడి భగభగలు తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లకే పరిమితమవుతున్న క్రమంలో గ్రామంలో సాయంసంధ్య వేళలో ఆరుబయట సేద తీరుతుంటారు..ఇది సర్వసాధారణం..ఇదే క్రమంలో కూచివారిపల్లె గ్రామంలో గ్రామస్తులు ఆరుబయట ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చాయో తేనెటీగలు గుంపులుగా జనం మీద పడ్డాయి. వాటికి తారసపడిన ప్రతి ఒక్కరిని కుట్టాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. భద్రత కలిగిన ప్రదేశాలలో చేరుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు ఊటుకూరు వెంకటరమణ, భార్య సుబ్బలక్షమ్మ ఇక్కడి విలేకర్లకు తెలిపారు. అలాగే గాయపడిన వారిలో కొంతమంది చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో చేరారు. మరికొందరికి వాంతులు, విరేచనాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు బంధవులు తెలియచేశారు.


