కూటమిలో వేలంపాట పోరు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో వేలంపాట పోరు

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

ముద్దనూరు: ముద్దనూరు మేజర్‌ గ్రామ పంచాయతీ వార్షిక వేలంపాట కూటమి వర్గీయుల్లో అంతర్గత పోరుకు దారితీసింది. బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాట కూటమి విభేదాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. వివరాలలోకి వెళ్తే గ్రామ పంచాయతీలో బస్టాండు, జంతువధశాలకు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహులు వేలంపాట నిర్వహించారు. అయితే వేలంపాట నిర్వహణలో కార్యదర్శి ఒకవర్గానికి అనుకూలంగా వ్యవహరించారని, తమను వేలంపాటలో ఉద్దేశంగా పాల్గొనకుండా చేశారని, గదిలో కూర్చొని వేలంపాట నిర్వహించారని ఒకవర్గం వాదించారు. వేలంపాటలో పోటీదారులు సమయానికి రాలేకపోవడం , డిపాజిట్‌ సొమ్ము చెల్లించకపోవడంతో తమకే వేలంపాట దక్కిందని, వేలంపాట పూర్తయిన తర్వాత వాదించడం తగదని కూటమిలోని మరోవర్గంవారు వాదించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ తతంగం నడిచింది. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి పంచాయతీ కార్యాలయంలో సుమారు 2గంటలకు పైగా కార్యదర్శితో చర్చించారు. ఎట్టకేలకు చివరికి కార్యదర్శి వేలంపాటను ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయడమైనదని ప్రకటించారు. సీఐ నగేష్‌బాబు సిబ్బందితో బందోబస్తు పర్యవేక్షించారు. ప్రతి ఏడాది ప్రశాంతంగా నిర్వహించే వేలంపాట అధికారుల తీరు, నిర్లక్ష్యంవల్ల రసాభాసగా మారిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement