చెమటోడ్చినా దక్కని ఫలం | - | Sakshi
Sakshi News home page

చెమటోడ్చినా దక్కని ఫలం

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

చెమటోడ్చినా దక్కని ఫలం

భూగర్భజలమే కాదు..

మామిడి రైతుల్లో ఆశా అడుగంటింది...

నిండుగా పూత పూసిందనుకునేలోపే

నేలరాలి నిలువునా కోత మిగిల్చింది..

అరకొరగా పట్టిన పిందైనా ‘ఫలమి’స్తుందని ఆశపడితే.. చుక్క నీరందక.. నిలువెత్తు చెట్టు ఎండిపోతోంది.. సీమను ఉద్యాన హబ్‌గా మారుస్తాన్న చంద్రబాబు మాటలాగే..

ఈ ఏడాదీ మామిడి రైతు బతుకుల్లో తియ్యదనం కరువైంది..

‘కాయా’కష్టానికి తగిన ‘ఫలం’దక్కక

తోట కొట్టాలో.. ఇంకా ‘కాపు’కాయాలో

తెలీక.. తేల్చుకోలేక నడితోటలో చూస్తుండిపోయాడు రైతు.. ఎండిన చెట్టు లాగే..

చక్రాయపేట: మామిడి రైతుల బతుకులు మాడిపోతున్నాయి.. తోటల్లోని బోర్లలో నీటి మట్టం అడుగంటిపోవడంతో చుక్క నీరందించలేక అన్నదాత ముఖమూ వాడిపోతోంది. దిక్కు తోచని రైతులు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందించి చెట్లను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈసమస్య చాలదన్నట్లు విద్యుత్‌ శాఖ అధికారుల వైపు నుంచి కూడా రైతులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఉద్యాన పంటల రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఫారం ఫాండ్లు ఉపయోగించుకుందామంటే విద్యుత్‌ శాఖ అధికారులు వాటికి మోటార్లు బిగించొద్దని అడ్డు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ఫారం ఫాండ్లు నీటితో నింపి తోటలు పారగట్టుకుందామంటే వాటికి మోటార్లు బిగించొద్దంటే అవి ఉండి ప్రయోజనం ఏమిటని రైతులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి అడ్డంకులు ఏమీ లేవని కూటమి ప్రభుత్వంలో అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకొర కాపునకు అగచాట్లు ఎన్నో..

ఈ ఏడు మామిడి పూత తొలుత ఆనందాన్ని ఇచ్చినా పిందె పట్టే సమయానికి పూత మొత్తం రాలిపోయి దుఃఖాన్ని మిగిల్చింది. అప్పటికే ఎకరాకు సుమారు లక్షపైగా రైతన్నలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. పూతతో పాటు అరకొరగా పట్టిన పిందె కాస్తా రాలిపోవడంతో రైతు బతుకుల్లో తీపి కరువైంది. ఎండలు ముదిరి పోవడంతో ట్యాంకర్ల నీళ్లు చెట్లకు చాలక వాడు ముఖం విడిచి పెట్ట లేదు.దీంతో ఉన్న పిందే కాస్తా నేల పాలైంది.

తోటలు కొట్టేయాలో..

పరువుకోసం పాకులాడాలో...

కాపు మొత్తం పోయి అప్పులు మిగిల్చి ఖాళీగా ఉన్న మామిడి తోటలను కొట్టేయాలో పరువు కోసం వాటికి ట్యాంకర్లతో మళ్లీ లక్షలు ఖర్చు పెట్టి కాపాడు కోవాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. మూడేళ్లుగా మామిడి రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ట్యాంకర్లు పెట్టి తోలుదా మంటే దరిదాపుల్లో వాటికి నీళ్లు పట్టించే నాథుడు కూడా లేడని రైతులు వాపోతున్నారు. ఈపరిస్థితిలో చెట్లు కొట్టేస్తే గ్రామాల్లో తోటలకు నీళ్లు తోలుకోలేక కొట్టేశాడని జనాలు ఎత్తి పొడుపు మాటలు వినాల్సి వస్తోందని ఓరైతు కంట తడి పెట్డాడు

ఏదీ భరోసా

గత ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకొంది. రైతు భరోసా పేరుతో వారికి అండగా నిలిచింది.కూటమి ప్రభుత్వం వచ్చాక మామిడి రైతులకు భరోసానే కరువైంది.దీనికి తోడు గతేడాది బీమా కింద హెక్టారు రూ.8వందల వరకు రైతులచే కట్టించుకున్న ప్రభుత్వం చివరకు ఒక్క పైసా కూడా విదిల్చ లేదు. భీమా పేరుతో కూడా రైతులను ముంచిన ప్రభుత్వం అనే అపవాదును కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది.

చతికిల పడ్డ బోర్లు

తోటలు కాపాడుకునేందుకు పాట్లు

ఫారం ఫాండ్లు వాడుకుందామంటేఅడ్డంకులు

విద్యుత్‌ మోటార్లు బిగించొద్దంటూ అధికారుల కొర్రీ

తోటలు కొట్టేసేది మేలేమో

రైతు అగచాట్లు అన్నీ ఇన్నీ కాకుండా ఉన్నా యి. ఈఅగచాట్లు పడే కంటే తోటలు కొట్టే ఎక్కడికై నా వెళ్లి పోయేది మేలని పి స్తోంది. ట్యాంకు నీల్లు తోటలోకి వచ్చేదానికి రెండు వేలు పైగా ఖర్చు వస్తోంది. పంట దిగుబడులు లేవు. ఆదాయాలు లేవు ఎంత కాలం ఇలా బతకాలో తెలియకుండా ఉంది. –తులసీ రామ్‌,రైతు, సురభి

ఫారం ఫాండ్లకు మోటార్లు వద్దంటున్నారు

వేవిలో అరకొర నీళ్లు రైతులు ఫారం ఫాండ్లతో తోటలు పారకట్టుకుందామంటే విద్యుత్‌ అధికారులు వాటికి మోటార్లు బిగించొద్దని చెబుతున్నారు.ప్రభుత్వం రైతులు ఫారం ఫాండ్లు తవ్వుకోమని సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే విద్యుత్‌ సర్వీసులు కల్పించక పోతే అవి ఎందుకు ఉపయోగ పడతాయి. –అల్లపురెడ్డి సూర్య ప్రసాదరెడ్డి,

మామిడి రైతు, మహబూబ్‌ నగర్‌, సురభి గ్రామం

ఎన్ని నీళ్లని తోలాలో దిక్కు తోచలే

పెద్ద పెద్ద చెట్లు అయినాయి. ట్యాంకరు నీళ్లు పట్టకస్తే నాలుగు చెట్లకు చాలవు. తోటకు ఒక తడి నీళ్లు ట్యాంకుతో పట్టేందుకు ఎకరాకు 20 వేలవుతుంది. మళ్లీ మొదటికి వచ్చే కొద్ది చెట్లు వాడి పోతున్నాయి. కాయలు వాడి వత్తులు అయి పోతున్నాయి. ఇట్లా ఎంత కాలం ఎన్ని నీళ్లని తోలాలో తెలియడం లేదు. –ఊటుకూరు మధుసూధనరెడ్డి మామిడి రైతు ఊటుకూరు వాండ్లపల్లె

Advertisement
 
Advertisement
Advertisement