కడప సెవెన్‌రోడ్స్: సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వేణును డిప్యూటేషన్‌పై జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.
ముద్దనూరు: ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలోని ఘాట్‌రోడ్డులో చిరుతపులి కనిపించినట్లు సమాచారం రావడంతో స్థానిక అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక మునయ్యకోన సమీపంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రోడ్డుపై పులి కనిపించినట్లు ఫారెస్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది ఘాట్‌రోడ్డులో తనిఖీలు చేపట్టారు. పులి సంచరించినట్లు ఆనవాళ్లు లభించలేదని, ఈ రహదారిలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక డిప్యూటీ రేంజి అధికారి శ్రీనివాసులు తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రత్యేక ‘స్వీయ గణన‘ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి దశలో ’ఇళ్ల జాబితా,గృహల గణన’ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారన్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30 వరకు స్వీయగణన గడువు ఉంటుందన్నారు. మే 1 నుంచి మే 30 వరకు (30 రోజులు) పాటు ఎన్యూమరేటర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి గణన నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న ప్రజా ప్రతినిధులతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు, విద్యార్థులు, అంగన్వాడీ లబ్ధిదారులు, గిరిజన ప్రాంతాల ప్రజలు, పారిశ్రామిక కార్మికులకు ప్రత్యేక రోజులను కేటాయించి అవగాహన కల్పిస్తారని జిల్లా కలెక్టర్ వివరించారు.
కడప ఎడ్యుకేషన్: మేడే సందర్భంగా మే 1న కడపలో మహా సంకల్ప గర్జనను నిర్వహించనున్నామని.. దీనిని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షమ్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్( ఏపీ సీపీఎస్ ఈఏ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీయపురెడ్డి వెంకట జనార్థన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కడపలోని 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో మంగళవారం ఏపీ సీపీఎస్ ఈఏ నాయకులు ’మేడే మహా సంకల్ప గర్జన’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఏపీఎస్) పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతోందని పేర్కొన్నారు. మే 1వ తేదీన ఉదయం 10:30 గంటలకు కడప నగరంలోని వాజ్‌పేయ్ విగ్రహం నుంచి కొత్త కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖాదర్ భాష, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్, బిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివార్జున తదితరులు పాల్గొన్నారు.
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూ లు, నంద్యాల జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈనెల 15వ తేది బుధవారం పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారిశ్రామిక విద్యుత్ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ‘పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక‘ను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయంలో మొదటి బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారానికి నోచుకోని పారిశ్రామిక విద్యుత్ సమస్యలను మూడవ బుధవారం తిరుపతిలోని ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా నేరుగా సీఎండీని కలిసి ఆ సమస్యల్ని విన్నవించవచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


