● పర్లపాడు హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
● ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ విభూకృష్ణ స్వాధీనం చేసుకున్న పిడిబాకు, కట్టెలు
ప్రొద్దుటూరు క్రైం : అది ప్రాణాలను తీసేంత సమస్య అయితే కాదు.. చిన్నపిల్లలు తిరుగుతుంటారు బైక్‌లో వేగంగా వెళ్లొద్దని అతన్ని వారించారు. ఆ మంచి సూచనే గొడవకు కారణమైంది. పరస్పర అహంకారం, పూర్వకక్షల కారణంగా అది తీవ్రమైన ఘర్షణగా మారి హత్యకు దారి తీసింది. రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో ఈ నెల 10న హత్యకు గురైన బంగి మహేష్‌బాబు కేసులో ముగ్గురు నిందితులను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను ఏఎస్పీ విభూకృష్ణ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో బంగి చరణ్ బైక్‌లో వేగంగా వెళ్తుండటంతో వీధిలో పిల్లలు ఉన్నారని, నెమ్మదిగా వెళ్లాలని మహేష్‌బాబు కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో చరణ్ వారితో వాగ్వాదానికి దిగాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన చరణ్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మహేష్‌బాబు కుటుంబ సభ్యులు సాయంత్రం సమయంలో వీధిలో వెళ్తున్న సమయంలో వారిని చరణ్ అడ్డగించి దాడి చేశాడు. విషయం తెలియడంతో మహేష్‌బాబు ఘటనా స్థలానికి వెళ్లి ఎందుకు తమ కుటుంబ సభ్యులను కొడుతున్నారని అడుగగా.. చరణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు పిడి బాకుతో మహేష్‌బాబు గొంతులో పొడిచారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో మహేష్‌బాబు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. ఈ ఘటనపై అదే రోజు రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితులు బంగి చరణ్, బంగి సురేష్, బంగి దేవమ్మలు చిన్నశెట్టిపల్లె దారిలో ఉన్నారని తెలియడంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిడి బాకు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస
ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరచి, త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ సీఐ నాగభూషణ్, రాజుపాళెం ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డి, ప్రొద్దుటూరు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, రాజుపాళెం పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకొని హింసకు దిగడం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.


