స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

మోపిదేవి : కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండల కేంద్రంలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కడప వాస్తవ్యులు కె.వేణుగోపాలరెడ్డి, విశాలాక్ష్మి దంపతులు రూ.50,116 విరాళంగా మంగళవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావుకు విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : కుటుంబ సమస్యలతో ఓ వివాహిత క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకున్న ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జరప్పల్లికి చెందిన రెడ్డెప్ప భార్య చైత్ర(26) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి చైత్రను వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్‌ చేశారు.

అన్నదమ్ములపై కర్రలతో దాడి

మదనపల్లె టౌన్‌ : ఇంటి నిర్మాణం అడ్డుకొని అన్నదమ్ములపై ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. మంగళవారం బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సోంపాళ్యంకు చెందిన అన్నదమ్ములు ఊరికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో పునాది వేసి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. అదే సమయంలో అక్కడికి తన అనుచరులతో వచ్చిన మారయ్య ఆ స్థలం తమదంటూ గొడవకు దిగాడు. గొడవ తారా స్థాయికి చేరింది. అప్పటికే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో మారయ్య తన అనుచరులు అన్నదమ్ములు కుమార్‌, అనీల్‌ పై విచక్షణా రహితంగా దాడి చేసి చితక బాదారు. వారికి గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు వైద్యం అందిస్తున్నారు. ఘర్షణ సమాచారంపై ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

స్కూటర్‌ ఢీకొని

వృద్ధుడికి గాయాలు

మదనపల్లె టౌన్‌ : స్కూటర్‌ ఢీకొని వృద్ధుడు గాయపడిన సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన రైతు వెంకటరమణ(65) సొంత పనిమీద మదనపల్లెకు వచ్చాడు. స్థానిక చిత్తూరు బస్టాండులో బస్సు దిగి రోడ్డు పక్కన అంగడి వద్దకు నడిచి వెళుతుండగా ఓ స్కూటరిస్టు వచ్చి ఢీకొట్టి వెళ్లి పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితున్ని ఓ కారు యజమాని జిల్లా ఆస్పత్రికి తరలించాడు.

Advertisement
 
Advertisement
Advertisement