అర్చకుల నివాస సముదాయంలో డమ్మీలు | - | Sakshi
Sakshi News home page

అర్చకుల నివాస సముదాయంలో డమ్మీలు

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలోని అర్చకుల నివాస గృహ సముదాయంలో కొందరు డమ్మీలు వచ్చి తిష్ట వేశారు. వారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోయినా గృహాలను కేటాయించడమే కాకుండా.. ఏకంగా ఆలయంలో హారతి పళ్లెం వద్ద స్థానం కల్పించారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఆలయానికి చెందిన ప్రధాన వ్యక్తి అండదండలు ఉన్నందునే వారిని తొలగించడానికి భయపడుతున్నారనే అపవాదును అధికారులు మూటగట్టుకొంటున్నారు. ఈ విషయం రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణ అనే వ్యక్తి బ్రాహ్మణ తెగకు సంబంధించిన వారు కాదు. అయినా గత కొన్నేళ్లుగా గండిలోనే తిష్ట వేశాడు. ఆయన ప్రధాన వ్యక్తి సహకారంతో అర్చకుల వసతి గృహ సముదాయంలో చోటు సంపాదించుకున్నారు. అక్కడే ఉంటూ ఆలయంలోకి వెళ్లడం, స్వామిని దర్శించుకొని హారతి పళ్లెం వద్ద నిలుచొని హారతులు ఇస్తూ.. అందులో భక్తులు వేసే కానుకలు భద్రపరచి తనకు ఆశ్రయం కల్పించిన ప్రధాన వ్యక్తికి అందజేసే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన బ్రాంహణ తెగకు చెందిన వాడే అని తెలియని భక్తులు ఆయనకు పాద నమస్కారాలు సైతం చేస్తుంటారు. ఈ విషయం తెలిసిన వారు పాపం అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే కొన్ని నెలల క్రితం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందని వ్యక్తి సతీ సమేతంగా వచ్చి మరో వసతి గృహంలో దిగాడు. ఆయన గత నెలలో వెళ్లిన ఉగాది పండుగ వరకు ఆలయంలో తాయత్తులు విక్రయించి వచ్చిన మొత్తాన్ని, మిగులు తాయత్తులను ఆ ప్రధాన వ్యక్తికి నమ్మకంగా అప్పగించే వాడు. ఉగాది అనంతరం జరిగిన పరిణామాలతో అధికారులు తాయత్తులు విక్రయంచకూడదని చెప్పడంతో ఆయన శుభ కార్యాలకు వంటల తయారీకి వెళుతున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి భార్య ప్రధాన వ్యక్తి ఇంటిలో పనులు చెక్కబెడుతుంటుందని చర్చలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కూడా ఆలయ కార్యనిర్వాహణాధికారికి తెలిసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఆలయంలోని ప్రధాన వ్యక్తి అండదండలతోనే జరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటే.. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ హారతి పళ్లెం వద్ద ఉన్న వ్యక్తిని వెంటనే పంపించేయండి అంటూ ఆలయ సిబ్బందికి ఫోన్‌ ద్వారా ఆదేశాలు జరీ చేశారు. వంటలు చేయడానికి వెళ్లే వ్యక్తి విషయం మాత్రం ఏమీ బయటికి రాలేదు. కానీ కారకులపై మాత్రం విచారణకు గానీ చర్యలకు గానీ డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాలు ఇవ్వకపోవడం చర్చలకు దారి తీస్తోంది.

పూజారులు కాకపోయినా

గదుల కేటాయింపు

ఆలయంలోనూ అనధికారికంగా విధులు

అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం

Advertisement
 
Advertisement
Advertisement