గంజాయి కేసులో ఒకరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో ఒకరి అరెస్ట్‌

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

కడప అర్బన్‌ : కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కడప టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. ప్రసాదరావు మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు ఇంచార్జ్‌ డీఎస్పీ బాల స్వామిరెడ్డి సూచనల మేరకు మాదక ద్రవ్యాలపై నిఘా పెంచినట్లు తెలిపారు. ఈ నెల 14 తేదీన కడప నగరంలోని సీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో కేసీ కెనాల్‌ కల్వర్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఒక వ్యక్తి స్కూటర్‌పై వచ్చి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతన్ని పట్టుకుని విచారణ చేయగా అతని వద్ద గంజాయి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. వాహనం తనిఖీ చేసి 1250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అరెస్టు అయిన షేక్‌ ఇస్మాయిల్‌ బాషా గంజాయిని రౌడీ షీటర్‌ షేక్‌ అరాఫత్‌, షేక్‌ మహమ్మద్‌ అలీతో కలిసి కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా అమ్మాలని యత్నించినట్లు తెలిపారు. అదే విధంగా వ్యక్తిగత శత్రుత్వంతో ఇతరుల ఇళ్లలో గంజాయి పెట్టి వారిని పోలీసులకు చిక్కించే పన్నాగం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో షేక్‌ ఇస్మాయిల్‌ బాషాను పోలీసులు అరెస్ట్‌ చేయగా, రౌడీ షీటర్‌ షేక్‌ అరాఫత్‌, ఎంఐఎం పార్టీకి చెందిన షేక్‌ మహమ్మద్‌ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కేసులో 1250 గ్రాముల గంజాయి గల టీవీఎస్‌ యాక్సెస్‌ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు మాట్లాడుతూ రౌడీ షీటర్లు ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత గంజాయి, మద్యం వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో కడప టూ టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement