పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయ సమీపంలో రింగ్ రోడ్డు వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన పృథ్వీ(36) వేముల మండలం తుమ్మలపల్లె గ్రామ సమీపంలో ఉన్న యురేనియం ప్రాజెక్టులో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే యురేనియం ప్రాజెక్టుకు వెళ్లి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా టీడీపీ కార్యాలయ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పృథ్వీకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
స్పందించని 108 వాహనం
రోడ్డు ప్రమాదంలో పృథ్వీ అనే యువకునికి తీవ్ర గాయాలై రోడ్డుపైనే పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించేందుకు 108 నంబర్‌కు ఫోన్ చేయగా వారు సరిగా స్పందించలేదు. దీంతో అర్ధగంట సేపు 108 అంబులెన్స్ వాహనం రాకపోవడంతో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు. 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే పృథ్వీ తన ప్రాణాలను దక్కించుకునే వాడని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనం అందుబాటులోకి వచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 సరిగా స్పందించడం లేదని స్థానికులు విమర్శించారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా 108 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా 108 జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


