15న జలధారపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

15న జలధారపై అవగాహన

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

బద్వేలు అర్బన్‌ : జలమే సంపద, జలమే జీవనాధారం అన్న సత్యాన్ని ప్రజలు గుర్తెరిగేలా ఈ నెల 15న జలధార అవగాహన కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి బద్వేలు ఆర్డీఓ కార్యాలయం నుంచి జలధార ... నీటి భద్రత – తాగునీటి సంఘాల బాధ్యత అమలు ప్రణాళికపై ఈ నెల 15న అవగాహన కల్పించే కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. జలధార కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 15న ప్రతి గ్రామంలో జలచిత్రపటం ఆవిష్కరణ చేసి గ్రామంలో ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు. భూగర్భజలశాఖ వారు అందించే వాటర్‌ ఆడిట్‌ రిపోర్టు ఆధారంగా ప్రతి గ్రామంలో, గ్రామ సచివాలయంలో విలేజ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహాయంతో జలవనరులకు సంబంధించిన జలచిత్రపటాన్ని తయారు చేయాలన్నారు. నీటి వనరులను గుర్తించడం, నీటి భద్రత, సాగునీటి పొదుపు, వాగులు, చెరువుల అనుసంధానం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తొలుత చింతలచెరువు గ్రామంలో నిర్వహించిన జలధార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ నాయకుడు రితీష్‌కుమార్‌రెడ్డితో కలిసి రైతులు, సాగునీటి సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌, డ్వామా, డీఆర్‌డీఏ, భూగర్భజల, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement