● పీఆర్సీ కమిటీ వెంటనే వేయాలి
● 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలి
● ఉపాధ్యాయ సంఘాల నాయకులు
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన వెల్లువెత్తింది. పీఆర్‌సీ కమిటీని వెంటనే వేసి, 30 శాతం ఐఆర్‌ను మంజూరు చేయాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో) డిమాండ్ చేసింది. కడపలో పదో తరగతి మూల్యాంకన కేంద్రమైన మున్సిపల్ కార్పొరేషన్ (మెయిన్) హైస్కూల్ వద్ద సోమవారం ఆ ఆర్గనైజేషన్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూసో సభ్య సంఘాలు ఏపీటీఎఫ్ అమరావతి, పీఎస్‌హెచ్‌ఎంఏ, ఏఐఐటీఏ, ఎస్టీయూ–డీ, ఎస్‌ఈఏఏపీ, ఈడబ్లూఏ, ఎంటిఎస్ అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రూసో రాష్ట్ర చైర్మన్ సీవీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ ఆర్థిక లాభాలు రిటైర్డ్ అయిన రోజే చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎస్‌హెచ్‌సీఎంల సమస్యలు పరిష్కరించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు. రాష్ట్ర కో చైర్మన్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ గడువు ముగిసి మూడేళ్లు దగ్గర పడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఏఐఐటీఏఎస్ ఏసీ మెంబర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులకు పెండింగ్ ఉన్న ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున, సుదర్శన్ బాబు మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవన భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సీపీఎస్ రద్దు చేయాలి
పీఎస్‌హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, శ్యాంసుందర్ మాట్లాడుతూ సీపీఎస్ వెంటనే రద్దు చేయాలని, ప్రతి ఉద్యోగికి ఓపీఎస్ అనువర్తింప చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ అమరావతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఈశ్వరచంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు చెల్లించి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐఐటీఏ జిల్లా అధ్యక్షులు నజీర్ బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శించాలని కోరారు. దీనిపై రూసోతో చర్చలు జరపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగరాజు, కట్టు గంగాధర్, అబ్దుల్ కలాం, ఫయాజ్, అబ్బాస్ ఆలీ, పకృద్దీన్, అబిన్ బాషా, గుప్తా, గురువిరెడ్డి, శామీర్‌తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


