కారు బోల్తా.. ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఇద్దరి మృతి

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

గోపవరం : మండలంలోని శ్రీనివాసపురం సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–67)పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అట్లూరు మండలం మలినేనిపట్నం(బాలిరెడ్డిబావి)కు చెందిన కేశవ (24), బద్వేలు పట్టణానికి చెందిన శివచంద్ర (25) సెంచూరీ పానెల్స్‌ పరిశ్రమలో విధులు ముగించుకుని కారులో బద్వేలుకు వెళుతుండగా.. మండల కాంప్లెక్స్‌ ఎదురుగా ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు హుటాహుటిన వారిని అతి కష్టం మీద బయటికి తీశారు. అప్పటికే శివచంద్ర మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న కేశవను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించే సమయంలో కేశవ కూడా మృతి చెందాడు. ప్రతి రోజూ వారిద్దరూ కలిసి సెంచూరీ పానెల్స్‌కు వెళ్లి విధులు ముగించుకుని తిరిగి వస్తుండేవారు. ఉన్నపలంగా ఒక్కసారిగా ఇరువురినీ మృత్యువు వెంటాడింది. ప్రయాణిస్తున్న కారు వేగంగా రావడమే కాక ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని దుకాణాలపై పడింది. సమాచారం అందుకున్న బద్వేలు రూరల్‌ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాల వద్ద బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement