సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శిస్తున్న విద్యార్థులు, మాట్లాడుతున్న కళాశాల విద్య ఆర్‌జేడీ జ్ఞానేశ్వర్
కడప ఎడ్యుకేషన్ : ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ) డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. కడపలోని ప్రభుత్వ పురుషుల కళాశాల(ఆర్ట్స్ కళాశాల)లో సోమవారం 78వ వార్షికోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్‌జేడీ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు కళాశాలలో బాగా చదివి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. అందుకు తగినట్లుగా అధ్యాపకులు వివిధ రకాల నైపుణ్యాలను బోధిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ అతిథులు, కళాశాల ప్రణాళికా సంఘం సభ్యులు మానస చిన్నపరెడ్డి, పోతుల వెంకట్రామిరెడ్డి, సర్వశిక్షా అభియాన్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురివిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ మాట్లాడుతూ ఈ కళాశాల ఎంతో మంది ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అధ్యాపకులు, కళాకారులను తయారు చేసిన ఘనత పొందిందని అన్నారు. ఈ కళాశాలలో చదువుకోవడం తమ అదృష్టమని పూర్వ విద్యార్థులైన వారు కొనియాడారు. తాము కళాశాల అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తామని ప్రకటించారు. కళాశాల ఉప ప్రధానాచార్యులు డాక్టర్ ఎం. రమేష్‌లు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నాయకత్వంలో అధ్యాపకుల సహకారంతో విద్యార్థినీ, విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. కళాశాల పరిపాలనాధికారి డాక్టర్ రమణరావు మాట్లాడుతూ కళాశాల ఎంతో ప్రఖ్యాతి, ఘనతలు కలిగినదని, ఈ కళాశాలలో పని చేయడం తమ అదృష్టమని అన్నారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


