పులివెందుల రూరల్ : పులివెందుల మండలం పుట్రాయునిపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి సోమవారం గ్రామ సమీపంలో ఉన్న తాటిచెట్టు పైకి ఎక్కి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి మృతి చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి ప్రతి ఏడాది వేసవి కాలంలో తాటి చెట్లకు కాయలు కోసి పులివెందుల తెచ్చి విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటుండే వాడు. ఈ నేపథ్యంలో సోమవారం తాటి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాలుడి అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక నాగేంద్రనగర్‌కు చెందిన సత్యజితేంద్రనాథ్ అనే 9వ తరగతి చదువుతున్న బాలుడు తండ్రి మందలించాడని ఈనెల 9న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏఎస్‌ఐ జాషువా, కానిస్టేబుల్ నరసింహ దర్యాప్తు చేపట్టరు. బాలుడు కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఉన్నట్లు సాంకేతికత ఆధారంగా గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం బాలుడిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన ఏఎస్‌ఐ జాషువా, కానిస్టేబుల్ నరసింహనాయుడులను ఏఎస్పీ విభూకృష్ణ, సీఐ టీవీ కొండారెడ్డి అభినందించారు.
బాలిక అదృశ్యం
రొంపిచెర్ల : మైనర్ బాలిక (16) అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దగొట్టిగల్లు గ్రామ పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన మైనర్ బాలిక ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.


