ప్రొద్దుటూరు క్రైం : మెహరాజ్‌బాను అనే మహిళ పిల్లల చదువు కోసం కట్టిన రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలను దూషించడమే కాకుండా మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవిపై పూజా స్కూల్ సీఈఓ కవిత రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన మెహరాజ్‌బాను అనే మహిళ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా పని చేసేది. సోఫియా జోయా, మహమ్మద్ ముత్తజా సాధిక్, సుఫియాన్ అనే ఆమె ముగ్గురు పిల్లలు చౌడూరు సమీపంలోని పూజా స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో 2023లో మెహరాజ్ భర్త దస్తగిరి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ కారణంగా పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితులు ఏర్పడటంతో.. పెద్దశెట్టిపల్లె గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుల సాయంతో మెహరాజ్‌బాను అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని ఆశ్రయించింది. ఆమె కుటుంబ పరిస్థితులను చూసి చలించిన రాచమల్లు ముగ్గురు పిల్లలకు 10వ తరగతి వరకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని చెప్పారు. పిల్లల పేరుతో రూ.3 లక్షల బాండ్లు, రూ.2 లక్షలు నగదు ఇచ్చారు. ముగ్గురు పిల్లలకు 10వ తరగతి వరకు అయ్చే రూ.10 లక్షలను భరిస్తానని ఆమెకు ఽధైర్యం చెప్పి ఆ మేరకు పూజా స్కూల్ యాజమాన్యానికి రూ.5 లక్షలు కట్టారు. ఈ డబ్బు అయిపోగానే మిగతా రూ.5 లక్షలు ఇస్తానని చెప్పారు. అయితే పూజా స్కూల్ నిర్వాహకుడు రాజారెడ్డి హత్యకు గురి కావడం, పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి మూసేయడంతో మెహరాజ్ తన పిల్లలను మరో స్కూల్‌లో చేర్పించింది. పిల్లలు చదువుతున్న పాఠశాల యాజమాన్యం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డబ్బు కోసం మెహరాజ్ పూజా స్కూల్‌కు వెళ్లింది. నాటి నుంచి నేటి వరకు అంటే రెండేళ్ల పాటు డబ్బు కోసం స్కూల్ వద్దకు తిరుగుతూనే ఉంది. డబ్బు తిరిగి ఇవ్వకపోగా పాఠశాల యాజమాన్యం ఆమెనే హేళన చేస్తూ దూషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇదే విషయాన్ని మెహరాజ్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వద్దకు వెళ్లి వివరించారు. దీంతో రాచమల్లు ఈ విషయమై మాట్లాడేందుకు మూడు రోజుల క్రితం మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, మరి కొంత మంది పార్టీ మహిళా నేతలను పూజా స్కూల్ వద్దకు పంపించారు. పాఠశాల సీఈఓ కవితతో డబ్బు విషయమై మాట్లాడుతుండగా వారి పట్ల ఆమె నిర్ల్యక్ష్యంగా వ్యవరించి పరుష పదజాలంతో దూషించింది. అంతటితో ఆగక తనను బెదిరించారంటూ మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవిపై ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బాధిత మహిళ మెహరాజ్, పార్టీ శ్రేణులతో కలసి శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ పూజా స్కూల్‌లో పని చేసే కవిత, భవ్య అనే ఇద్దరు మహిళలు మెహరాజ్ పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నారు. డబ్బు తిరిగి ఇవ్వబోము, తమకు సంబంధం లేదు ఇక్కడి నుంచి గేటు దాటు అంటూ పరుష పదజాలంతో అవమానించారన్నారు. ఈ విషయం తనకు తెలియడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళా నేతలను స్కూల్ వద్దకు పంపగా వాళ్లను కూడా వారు చులకనగా, హేళనగా, బెదిరింపు ధోరణితో నిర్లక్ష్యంగా మాట్లాడారని చెప్పారు. అంతేగాక మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవిపై పూజా స్కూల్ కవిత ఫిర్యాదు చేయగా ఆగమేఘాల మీద, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రెండేళ్లుగా పాఠశాల యాజమాన్యం మెహరాజ్‌ను ఇబ్బంది పెట్టారని, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని, అడిగేందుకు వెళ్తే కవిత, భవ్యతోపాటు గణేష్ అనే మరో వ్యక్తి పరుష పదజాలంతో దుర్భాషలాడారని వీరిపై చర్యలు తీసుకోవాలని మెహరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు నమోదు చేయాలని, మానవతా హృదయంతో స్కూల్ యాజమాన్యాన్ని పిలిపించి పిల్లలకు రావాల్సిన డబ్బు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే రేపు మళ్లీ స్టేషన్‌కు వస్తామని రూరల్ ఎస్‌ఐ రాజుతో అన్నారు. బాధితురాలికి స్కూల్ యాజమాన్యం డబ్బు చెల్లించే వరకు శాంతియుతంగా పోరాడతామని, అందుకు పోలీసులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లె లక్ష్మీదేవి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి సారూ..
పిల్లల స్కూల్ ఫీజు కట్టకపోవడంతో వారి చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని, తమకు రావాల్సిన రూ.5 లక్షలను పూజా స్కూల్ యాజమాన్యం నుంచి ఇప్పించాలని బాధిత మహిళ మెహరాజ్‌బాను తెలిపారు. డబ్బు ఇవ్వాలని రెండేళ్లుగా పూజా స్కూల్ చుట్టూ తిరుగుతున్నా వాళ్లకు కనికరం లేకుండా పోయిందన్నారు. దయచేసి డబ్బులు ఇప్పిస్తే పిల్లల చదువులు పూర్తి చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న
యాజమాన్యం
వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసు
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రాచమల్లు
సీఈఓ, సిబ్బందిపై బాధితురాలు ఫిర్యాదు


