మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఉమ్మడి శెట్టి జయవాణి(29) మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపరాల గ్రామం కొత్త కొట్టాలలో జయరాముడు, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో జయవాణి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనను గమనించిన తండ్రి జయరాముడు వెంటనే ఆమెను జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తాళం వేసిన ఇంటికి కన్నం
ముద్దనూరు : మండల కేంద్రంలోని తాడిపత్రి రహదారిలో హెబ్రోను చర్చి సమీపంలో తాళం వేసిన ఇంటిలో శనివారం చోరీ జరిగింది. సీఐ నగేష్‌బాబు తెలిపిన మేరకు వివరాలు.. నాగలక్షుమ్మ అనే మహిళ ఈ నెల 9వ తేదీన ఆమె తల్లి కంటి ఆపరేషన్ కోసం ఇంటికి తాళం వేసి ప్రొద్దుటూరుకు వెళ్లింది. శనివారం ఉదయం తిరిగి ఇంటికి రాగా తాళం పగలగొట్టినట్లు గుర్తించింది. ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా వాకిలి తెరిచి ఉంది. అందులోని రూ.20 వేల నగదు, సుమారు 3 గ్రాముల బంగారు కమ్మలు చోరీకి గురైనట్లు గుర్తించింది. బంగారు విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని క్లూస్‌టీం సభ్యులు తనిఖీ చేసి వివరాలు సేకరించినట్లు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
బద్వేలు అర్బన్ : అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 59 బస్తాల రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గుంతపల్లె సమీపంలో శబరికుమార్ అనే వ్యక్తి ఇంటింటికి వెళ్లి రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమ రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వెళ్లి దాడులు నిర్వహించగా 59 బస్తాల రేషన్ బియ్యం లభ్యమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ శివశంకర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గీతాప్రసాద్‌రెడ్డి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.


