పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న పాత బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని అర్బన్ పోలీస్‌స్టేషనల్‌లో ఆయన అర్బన్ సీఐ శ్రీరామ్, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, తిమోతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జగదీష్‌పై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శనివారం పది గంటల ప్రాంతంలో పట్టణంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర విక్రం, తిరుపాలు, శ్రీనివాసులును అరెస్టు చేశామన్నారు. అనంతరం దాడి జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి దాడి ఎలా జరిగిందో సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో మరొక నిందితుడు చిన్నా అలియాస్ తరుణ్ పరారీలో ఉన్నారన్నారు. గొడవకు ప్రధాన కారణం అరటి కాయల కూలీల విషయంపై మనస్పర్థలు వచ్చి తాగిన మద్యం మత్తులో మాటకుమాట పెరిగి జగదీష్‌పై దాడి చేశారన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా ఘర్షణలకు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


