షర్మిలమ్మ స్టాండ్ ఏమిటి?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్‌ను రాజధానిగా ప్రతిపాదన చేసినప్పటి నుంచి ప్రకంపనలు మొదలయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనూ, పచ్చ మీడియాకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఇలా .. వారందరి హృదయాల్లో ప్రకంపనలే వీస్తున్నాయని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని చెప్పడంతోపాటు రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరమవుతుందని, కేవలం రూ.20 వేల కోట్లతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పరిధిలో మావిగన్‌ను నిర్మించవచ్చని జగన్ సూచించారన్నారు. రాష్ట్రానికి ఇది గ్రోత్ ఇంజిన్‌గా పని చేస్తుందని జగన్ తెలిపారన్నారు. ఈ ప్రతిపాదనను పచ్చ మీడియా, కూటమి ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించే పరిస్థితుల్లో లేవన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మావిగన్ ప్రతిపాదన చేసి జగన్ జోకర్ అయ్యారని విమర్శించారన్నారు. జగన్ జోకర్ కాదని, మంచిని సూచించే మెంటర్ అని స్పష్టం చేశారు. ఏనాడో శివరామకృష్ణన్ కమిటీ అమరావతి నిర్మాణం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని తెలిపిందన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడితే అందరికీ నష్టం వస్తుందన్నారు.
అమరావతిపై మీ స్టాండ్ ఏమిటని షర్మిలమ్మను రాచమల్లు ప్రశ్నించారు. మావిగన్‌ను వ్యతిరేకిస్తున్నారు సరే అమరావతిని నిర్మించాలనుకుంటున్నారా అని అన్నారు. బాబుకు మద్దతుగా షర్మిలమ్మ చిలకపలుకులు, పవన్ కళ్యాణ్ ప్యా కేజీ పలుకులు పలుకుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రతి సారి వచ్చి చిలక పలుకులు పలుకుతున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా ఉన్న షర్మిలమ్మ చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.


