కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈ నెల 26 నుంచి ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పున:స్థాపన ప్రక్రియ ప్రారంభించిస్తున్నట్లు డీఎస్‌డీఓ గౌస్ బాషా తెలిపారు. శుక్రవారం కడపలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో విలేకరుతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారుల అభివద్ధికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం,నాణ్యమైన శిక్షణ వసతులు కల్పించడం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. 15 సంవత్సరాలు పైబడిన, 19 సంవత్సరాల లోపు వయసుగల క్రీడాకారులు (2008 జనవరి1 నుంచి 2011 జనవరి 1 జన్మించినవారు ) క్రీడాకారుల ప్రవేశానికి అర్హులని తెలిపారు.
సిద్దవటం: రెండు దశల్లో 2027 జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ఉంటుందని జిల్లా సెన్సెస్ ఇన్‌చార్జి మోహన్ రమణ తెలిపారు. సిద్దవటం జెడ్పీ హైస్కూల్‌లో 2027 సెన్సెస్ కార్యక్రమంపై ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ రమణ, చీఫ్ ప్లానింగ్ అధికారి హజరతయ్యలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఓ శివప్రసాద్ మాట్లా డుతూ సెన్సెస్ మొదటి దశ ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. జన గణన రెండో దశ 2027 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతుందన్నారు. ఎవరికి వారే స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, ట్రైనర్స్ నరసింహారెడ్డి, శ్రీధర్‌నాయుడు, యన్యుమరేటర్లు (సచివాలయ ఉద్యోగులు), సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కడప అర్బన్: జిల్లాలో నేరాల నిరోధానికి రాత్రి పూట ముమ్మరంగా వాహన తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(నాకాబందీ)లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి సేవించే,, విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా మ ద్యం విక్రయించే బెల్ట్ షాపులపై, రాత్రిపూట రోడ్లపై అనవసరంగా తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప ఇన్‌చార్పి డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు.


