మగ్గుతున్న మగ్గం నిధులు
దశలవారీ ఆందోళనలకు సిద్ధం
కడప సెవెన్‌రోడ్స్: చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని తరచూ వల్లెవేసే కూటమి ప్రభుత్వానికి వారి సంక్షేమం పట్టడం లేదు. ట్రిపుల్ ఆర్ (పునరుద్ధరణ, సంస్కరణ, పునర్నిర్మాణం) పథకం కింద విడుదలైన నిధులు చేనేత సహకార సంఘాలకు అందించి ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం కుంటిసాకులతో తీవ్ర కాలయాపన చేస్తోంది. ఫలితంగా కోట్లాది రూపాయల ట్రిపుల్ ఆర్ నిధులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సస్పెన్స్ అకౌంటులో మగ్గిపోతున్నాయి. స్వయాన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత చేనేత జౌళిశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్నా ప్రయోజనం లేదంటే ప్రభుత్వానికి చేనేతల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. కాగా నిధులు విడుదల చేసి ఆదుకోవాలంటూ చేనేత సహకార సంఘాల నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చేనేత ఐక్యవేదిక సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున తెలిపారు.
● సిక్ అయిన చేనేత సంఘాలను ఆదుకునే ఉద్దేశ్యంతో 2013లో ట్రిపుల్ ఆర్ పథకం అమలులోకి వచ్చింది. జిల్లాలో 200 పైచిలుకు చేనేత సొసైటీలు ఉండగా, తొలి విడతలో ట్రిపుల్ ఆర్ కింద 52 చేనేత సహకార సంఘాలకు సాయం లభించింది. రెండవ దశలో 110 సొసైటీలకు సాయం పొందేందుకు అర్హత ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కాగా, దాని అమ లుకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులు తొలగించి పథకాన్ని సొసైటీలకు వర్తింపజేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఇద్దరు అధికారులు, జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్‌తో కలిపి ప్రభుత్వం త్రీ మెన్ కమిటీని వేసింది. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి జిల్లాలోని 110 సొసైటీలకు పథకాన్ని వర్తింపజేయవచ్చని సిఫార్సు చేసింది. దీంతో 2020 సెప్టెంబరు 25వ తేది నాబార్డు ఈ పథకానికిగాను రూ. 13,68,46, 445లను విడుదల చేసింది. ఏ సొసైటీకి ఎంత మొత్తం సాయం అందించారో కూడా పేర్కొంటూ వివరాలతో కూడిన అనెక్సర్ పంపించారు.
మెలికపెట్టి..
ఇదిలాఉండగా, లివరి సప్లయ్ చేసే సొసైటీల పైన కొన్ని అభియోగాలు వచ్చాయి. ఈ సొసైటీలపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కాగా, చేనేత జౌళిశాఖ రాష్ట్ర కమిషనర్ లివరి సొసైటీలతోపాటు మిగతా చేనేత సొసైటీలకు కూడా ట్రిపుల్ ఆర్ కింద లబ్ది ఆపాలంటూ 2020 అక్టోబరు 1వ తేది అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి లివరి సొసైటీలకు, చేనేత సహకార సంఘాలకు సంబంధమే లేదు. త్రీమ్యాన్ కమిటీ సిఫార్సు చేసిన 110 సొసైటీల్లో మూడు మాత్రమే లివరి సొసైటీలు ఉన్నాయి. వాటిని మినహాయించి మిగతా 107 సొసైటీలకు సాయం అందించాలని పలుమార్లు కోరినా ఫలితం కనిపించలేదు. సీఐడీ విచారణలో లేని ఈ సంఘాలకు ట్రిపుల్ ఆర్ పథకం కింద నిధులు విడుదల చేయాలంటూ 2023 మే 5వ తేది ఆర్‌సీ నెంబరు 1008/2020 ఎఫ్ మేరకు కలెక్టర్ కమిషనర్‌ను కోరారు. కలెక్టర్ సిఫార్సులు సైతం కమిషనర్ పట్టించుకోకుండా పాత పాటే పాడారు. డీసీసీ బ్యాంకులో ఉన్న ట్రిపుల్ ఆర్ నిధుల్లో 18 సొసైటీలకు సంబంధించి రూ. 2,24,40,000లు బకాయి కింద బ్యాంకు అధికారులు జమ చేసుకున్నారు. దీనిపై చేనేత సహకార సంఘాలు పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో తమకు ఆడిట్ నివేదిక పంపాలని కమిషనర్ కోరగా, జిల్లా ఏడీ పంపించారు. కానీ, ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు.
చేనేత సొసైటీలకు అందని సాయం
ఏళ్ల తరబడి డీసీసీబీలో మగ్గుతున్న నిధులు
నేడు కలెక్టరేట్ ఎదుట చేనేతల ధర్నా
చేనేత సహకార సంఘాలకు నిధులు విడుదల చేయాలని మంగళవారం చేనేత ఐక్యవేదిక సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున కమిషనర్ రేఖారాణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆధార్, బ్యాంకు అకౌంటు నెంబర్లు పంపితే పరిశీలిస్తామని కమిషనర్ బదులిచ్చారు. ఇలాఏదో ఒక సాకుతో నిధులు విడుద ల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంపై సొసైటీల ప్రతినిధులు భగ్గుమంటున్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు చెందిన సొసైటీ ప్రతినిధులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
మగ్గుతున్న మగ్గం నిధులు
మగ్గుతున్న మగ్గం నిధులు


