నిమ్మతోటలు చూసి వెళ్తూ..
● చెట్టును ఢీకొట్టిన బొలెరో వాహనం
● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
చేజర్ల : బొలెరో వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన బుధవారం చేజర్ల మండలం ఆదూరుపల్లి గురుకుల పాఠశాల వద్ద జరిగింది. చేజర్ల పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలుపల్లి గ్రామానికి చెందిన మూలింటి జయరాముడు (55), మరో వ్యక్తి నెల్లి వరప్రసాద్ చేజర్ల మండలం వావిలేరు గ్రామ పరిసర ప్రాంతాల్లో నిమ్మతోటలు లీజుకు తీసుకున్నారు. వారు తోటల వద్దకు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఆదూరుపల్లి గురుకుల పాఠశాల సమీపంలో ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొట్టింది. వాహనం నడుపుతున్న జయరాముడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన వరప్రసాద్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో పొదలకూరు సీహెచ్‌సీకి తరలించారు. చేజర్ల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.


