శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్
బద్వేలు అర్బన్/ఖాజీపేట/వల్లూరు/చాపాడు/అట్లూరు : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ తెలిపారు. ఆయన శనివారం బద్వేలులోని అర్బన్, రూరల్, రూరల్ సర్కిల్, ఖాజీపేట, చెన్నూరు, చాపాడు, అట్లూరు పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. స్టేషన్‌ల పరిసరాల్లో కలియ తిరిగారు. అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి.. స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బద్వేలులో అర్బన్, రూరల్ సీఐలు ఎస్.లింగప్ప, ఎన్.క్రిష్ణయ్య, ఎస్‌ఐలు తాహీర్‌హుస్సేన్, చిరంజీవి, ఖాజీపేటలో సీఐ వంశీధర్, చెన్నూరులో సీఐ కృష్ణారెడ్డి, అట్లూరులో ఎస్‌ఐ నాగ కీర్తన, చాపాడులో ఏఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ స్థానిక సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఖాజీపేట, అట్లూరులో పోలీస్‌స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. కొత్త భవనాల నిర్మించాలని వారు కోరారు. వాటి కోసం ప్రతిపాదనలు పంపాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట ఎస్‌బీ సీఐ సదాశివయ్య తదతరులు ఉన్నారు.


