భార్య విడాకులు అడిగిందని భర్త ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : వాళ్లది ప్రేమ వివాహం. భార్య విడాకులు ఇవ్వాలని అడగడంతో ఇష్టం లేని భర్త షేక్ మహబూబ్‌బాషా (36) మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూపర్‌బజార్ రోడ్డుకు చెందిన ఎర్రమియ్యాగారి షేక్ మహబూబ్‌బాషా ఒక డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను 7 ఏళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన శివమళ్లీశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సుగా పని చేస్తోంది. వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఒక వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త గొడవ పడసాగాడు. పోలీసులు కూడా గతంలో భార్యభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వారి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ‘నీతో నేను సంసారం చేయలేను నాకు విడాకులు కావాలి’ అని భార్య అడిగింది. అతను అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను సీలింగ్‌కు చీర చుట్టుకొని ఉరేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన స్నేహితుడికి పంపించాడు. ‘నా లాంటి చావు ఎవరకీ రావొద్దు.. అది ఎవరూ భరించలేరు..’ అని వీడియోలో మాట్లాడటంతో స్నేహితుడు వెంటనే మహబూబ్‌బాషా ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసుకొని ఉన్నాడు. ఎంత పిలిచినా అతను పలకలేదు. దీంతో బంధువుల సాయంతో లోపలికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్తే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి అన్న షేక్ మహబూబ్‌హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


