కువైట్‌లో కాటంవారిపల్లె మహిళ మృతి
అట్లూరు : కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అట్లూరు మండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన కత్తి సరస్వతి (45) అనే మహిళ మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటంవారిపల్లె గ్రామానికి చెందిన కత్తి సరస్వతి జీవనోపాధి నిమిత్తం సుమారు 15 ఏళ్ల క్రితం కువైట్‌కు వెళ్లింది. అక్కడ పనులు చేసుకుంటూ సొంత ఊరికి వస్తూ వెళుతుండేది. అయితే బుధవారం కువైట్‌లోని ఉమెరియ ఏరియాలో సిగ్నల్ వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. మృతురాలికి భర్తతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కువైట్ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
బైక్ ఢీకొని చిన్నారి మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై జమాలపల్లె వద్ద రోడ్డు దాటుతున్న ఆసియా (7) అనే బాలికను రాయచోటి వైపు నుంచి బుల్లెట్ బైక్ వేగంగా వస్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆసియాను హుటాహుటిన ఆటోలో ఆసుపత్రికి తరలించే క్రమంలో దారిలోనే మృతి చెందింది. జమాల్‌పల్లె సమీపంలోని జె.నారాయణపురానికి చెందిన ఆరిఫుల్లా, ఆలీమున్ దంపతులకు ఆసియా ఏకై క సంతానం. తండ్రి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు సమాచారం.
పాలేగార్ వారసుడు మృతి
కడప సెవెన్‌రోడ్స్ : సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామం నగిరికి చెందిన పాలేగార్ వారసుడు గురిగింజకుంట మంగమనాయుడు (80) శనివారం మృతి చెందారు. కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పాలేగార్ వారసులకు రాష్ట్ర ప్రభుత్వం తవర్జీని పెంచాలని, నిలిచిపోయిన వారికి పునరుద్ధరించాలని, ఇతర డిమాండ్ల సాధనకు ఆయన పోరాడారు.ఆంధ్రప్రదేశ్ పాలేగార్ల వారసుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవులునాయుడు, ప్రధాన కార్యదర్శి జానకి రఘు, నాయకులు చంద్రప్పనాయుడు, బలరామయ్య, చరిత్ర పరిశోధకులు తవ్వా ఓబుల్‌రెడ్డి తదితరులు మంగమనాయుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
వేంపల్లె : మండలంలో ఇటీవల ఇంటి దొంగతనాల కేసులో వైఎస్ రాజారెడ్డి నగర్‌కు చెందిన చిక్కే శ్రీహరి అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పర్యవేక్షణలో ఎస్‌ఐలు రంగారావు, తిరుపాల్ నాయక్‌లు శనివారం దాడులు నిర్వహించారు. ఇటీవల కుమ్మరాంపల్లె గ్రామంలో మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి చిక్కే శ్రీహరి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దొంగలించారు. ఈ కేసులో పులివెందుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శనివారం శ్రీహరిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.90 వేల విలువ చేసే బంగారాన్ని రికవరీ చేశారు. చిక్కే శ్రీహరి గతంలో కూడా వేముల మండలం చాగలేరు గ్రామ సమీపంలో ఉన్న వినాయకస్వామి ఆలయంలో దొంగతనం చేసి ఘటనలో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది.
కువైట్‌లో కాటంవారిపల్లె మహిళ మృతి
కువైట్‌లో కాటంవారిపల్లె మహిళ మృతి


