బిందు, తుంపర సేద్య లక్ష్యాలను అధిగమించాలి
కడప అగ్రికల్చర్ : జిల్లాకు కేటాయించిన బిందు, తుంపర సేద్య లక్ష్యాలను ఏపీ ఎంఐపీ అధికారులు, జిల్లా కంపెనీ ప్రతినిధులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం(ఏపీ ఎంఐపీ) ఓఎస్డీ రమేష్ పేర్కొన్నారు. అలాగే ఆటోమేషన్‌ను బిందు సేద్యానికి జోడించి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను పొందేలా ప్రభుత్వం రైతులకు రాయితీ ఇచ్చేందుకు నిర్ణయించిందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కడప కలెక్టరేట్‌లోని ఏపీ ఎంఐపీ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 13500 హెక్టార్లు బిందు, తుంపర సేద్యం కోసం ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. ఇప్పటి వరకు 6550 మంది రైతులు 8195 హెక్టార్లలో కలెక్టర్ అనుమతులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కలెక్టర్ అనుమతులు పొందిన వాటికి త్వరితిగతిన బిందు, తుంపర పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కంపెనీ ప్రతినిధులు అవసరమున్న రైతులను గుర్తించి సూక్ష్మ సేద్య పరికారాలకు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం ఆయన ఫీల్డ్ విజిట్ చేసి బిందు, సేద్య పరికరాలను అమర్చిన తోటలను పరిశీలించారు.


