ఆడబిడ్డ నిధి..యాడ బాబూ !
వైఎస్ జగన్ పాలనలో అండగా వైఎస్సార్ చేయూత
మోసపోయామంటున్నారు
కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి
బద్వేలు : వంద మందికి భోజనాలు చేసి వేయి మందికి ఇస్తర్లు వేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. 2024లో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలంటూ కూటమి నాయకులు మైకులు పట్టుకుని ఊదరగొట్టారు. అధికారం చేపట్టాక ఏడాదికో పథకం అరకొరగా అమలు చేయడం ఆరునెలలకొకసారి పథకానికి సమాధికట్టడం పరిపాటైపోయింది. ఇక కూటమి ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఆడబిడ్డనిధి పథకానికి పురుడు పోయక ముందే సమాధి కట్టినట్లు తెలుస్తోంది. ‘ఆడబిడ్డనిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500లు నేరుగా మీ ఖాతాలో జమచేస్తాం.మీ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికీ ఎంతమంది ఉండే అంతమందికి మొత్తాన్ని అందిస్తాం’ అని సాక్షాత్తు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల సభల్లో హామీలిచ్చారు. ఆయనతో పాటు కూటమి నేతలందరూ హామీని ప్రచారం చేశారు. నీకు..నీకు..నీకు..వీళ్లకు..మీఅందరికీ..సమావేశంలో అందరికీ చూపుడు వేలూ చూపిస్తూ మరీ ఊరూ వాడా నమ్మబలికారు. కాదు..కాదు..జనాన్ని నమ్మించారు. ఎలాగైతేనేమి కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 20 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకూ ఆడబిడ్డ నిధి పథకం ఊసే లేకుండా పోయింది.
4 లక్షలు పైగా
మహిళలు అర్హులు
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 2024 ఎన్నికల సమయానికి మహిళా ఓటర్లు 16.44 లక్షల మంది ఉన్నారు.అందులో అనధికారిక అంచనాల ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు 4 లక్షల పైమాటే ఉన్నట్లు తెలుస్తోంది. ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వం ఒక్కో మహిళకు నెలకు రూ.1,500 చొప్పున 19 నెలలకు రూ.28.500లు బకాయి పడింది.ఈ విధంగా ఒక్క వైఎస్‌ఆర్ జిల్లాలో మహిళలకు రూ.1140 కోట్లు ఈ ఏడాది జనవరి నాటికి బకాయిలు చెల్లించాల్సింది. అయినా ఇంతవరకూ కూటమి ప్రభుత్వం పథకం అమలుకు ఎటువంటి చర్యలు తీసుకో లేదు. దీంతో గ్రామాల్లో మహిళలు మండి పడుతున్నారు. నలుగురు కూర్చునచోటల్లా ఆడబిడ్డ నిధిపై మాట్లాడుకుంటూ బాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆడబిడ్డ నిధుల కోసం 19 నెలలుగా అక్కచెల్లెమ్మల ఎదురు చూపు
ఒక్కో మహిళకు రూ.28,500 బకాయిలు
అడబిడ్డ నిధికి అర్హులు దాదాపుగా
4 లక్షల పైమాటే
జిల్లా మహిళలకు ఆడబిడ్డ నిధి కింద బాకీ రూ.1140 కోట్ల పైనే
ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్న
జిల్లా మహిళలు
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 18–59 ఏళ్లు వయస్సున్న మహిళలను ఆర్ధికంగా ఆదుకోవాలని భావించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ చేయాత పథకానికి పురుడు పోశారు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,500లు చెప్పిన టైంకు చెప్పినట్లుగా వారి ఖాతాల్లో జమచేశారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోనూ మాట తప్పకుండా వైఎస్‌ఆర్ చేయూత పథకం నిధులు మహిళల ఖాతాల్లో జమ చేశారు. నాలుగేళ్లలో జిల్లాలో మహిళలకు రూ.1,800 కోట్లు నేరుగా మహిళల ఖాతాలకు జమ చేశారు. వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని కాపీకొట్టిన చంద్రబాబు ఆడబిడ్డ నిధిగా పేరుమార్చి మహిళలను మాయ చేశారే తప్ప ఆడబిడ్డ నిధి కింద ఇంతవరకూ ఏ మహిళకు ఒక్క రూపాయి జమ చేయలేదని అక్కచెల్లెమ్మలు బాబు ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు.
ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 ఇస్తామంటే నమ్మాము...ఇంతమోసం చేస్తాడని అనుకోలేదని గ్రామాల్లో మహిళలు చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ ప్రభుత్వమే మేలని ఏడాదికి చెప్పినట్లుగా రూ.18,500లు మాకు వేసి మా అవసరాలు తీర్చాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మోసపోయామని వాపోతున్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయి ంచుకున్నారంటూ ఆవేశంతో అంటున్నారు.ఇప్పటికై నా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఈ 19 నెలల ఆడబిడ్డ నిధి బకాయిలు వారి ఖాతాల్లో జమచేస్తే ప్రభుత్వం మీద మహిళలకు ఉండే కోపం కొంతై నా తగ్గుతుంది.ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
– దేశాయి శారదమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు,పోరుమామిళ్ల
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500లు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కొలువుదీరారు. అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇంతవరకూ ఒక్క మహిళలకు ఆడబిడ్డనిధి జమ చేయలేదు. ప్రతి మహిళకు రూ.1,500ల చొప్పున గడిచిన 19 మాసాల బకాయిలను వారి అకౌంట్లో జమచేసి కూటమి ప్రభుత్వం మాట నిలుపుకోవాలి. –చక్రపాణి ఉమ, వైఎస్‌ఆర్ కాంగ్రేస్‌పార్టీ రాష్ట్ర మహిళా కార్య దర్శి,బద్వేలు.


