ఇసుకాసురుడు !
రాజంపేట : చెయ్యేరు నదిలో ఇటాచీల జోరు ఊపందుకుంది. ఇసుక కోసం చెయ్యేరును చెరబెడుతున్నారు. టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో ఇసుకరీచ్‌ల కొనసాగే విధంగా ముందుకెళుతున్నారని ఆరోపణలున్నాయి. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాలైన మందరం, ఎంజీ పురం, ఆడపూరు, కుమరనపల్లె ఇసుక రీచ్‌లు నిర్వహించనున్నారు. వీటిలో మందరం, కుమరనపల్లెలో రీచ్‌లు ప్రారంభమయ్యాయి. ఎంజీ పురంలో హద్దులు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో ప్రజలకు, తనకు సంబంధం లేదన్నట్లు ఆ ముఖ్యనేత ముందుకెళుతున్నారు. అయితే పెట్టుబడి లేకుండా 30 శాతం ఇసుకరీచ్‌లో ఆయనకు భాగస్వామ్యం కల్పించారని సమాచారం. తనతో పాటు నెల్లూరు, రైల్వేకోడూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల వారిని భాగస్వామ్యులుగా చేసి చెయ్యేరును నిట్టనిలుపునా దోపిడీ చేస్తున్నారు. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లు సదరు రాజంపేట టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లో కొనసాగుతున్నాయి. ఆయన తెరవెనుక ఉండి రీచ్‌లను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎంజీ పురం ఇసుకరీచ్ వివాదం
చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతమైన ఎంజీపురం(మదనగోపాలపురం)వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఇసుకరీచ్ వద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మైన్స్, అధికారులు ఎంజీపురం ఇసుకరీచ్ వద్దకు చేరుకొని హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేశారు. అయితే గ్రామస్తులు ఇసుక రీచ్ వల్ల తామంతా ఇబ్బంది పడతామని తెలిపారు. అయినా అధికారులు పై అధికారుల ఆదేశం మేరకు ఎంజీపురం ఇసుక రీచ్ వద్దకు వచ్చామని తెలిపారు. ఇసుకరీచ్ వల్ల తమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోతాయని, ఇసుక రవాణా వల్ల గ్రామస్తులు అనేక ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఇసుకరీచ్‌ను తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం బయనపల్లెకు చెందిన ఒకరు ఇసుక రీచ్‌లోకి దిగారు. ఈ క్రమంలోనే ఎంజీపురం క్వారీ విషయంలో రైల్వేకోడూరు చెందిన వారిని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
పచ్చనేత చేతిలో చెయ్యేరు
ఇటాచీలతో ఇసుక తోడివేత
ఎంజీపురంలో ఇసుకరీచ్ వివాదం
ముఖ్యనేతకు పెట్టుబడి లేకుండా వాటా
రీచ్ ఆదాయంలో 30శాతం భాగస్వామ్యం
ఇసుక దోపిడీకి సిద్ధమైన రీచ్‌లు


