మండల అధికారిపై పచ్చనేతల వీరంగం !
● అనుకూల కార్యదర్శికి మెమోనే కారణం
● కార్యాలయంలో విస్తుపోయిన సిబ్బంది
● మైనార్టీ అధికారిపై నేతల తీరు
వివాదాస్పదం
రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ మండల అధికారిపై గురువారం రాజంపేట పచ్చనేతలు నానా దుర్భాషలాడి వీరంగం సృష్టించిన సంఘటన సర్వ త్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది విస్తుపోయారు. టీడీ పీ నేతల తీరు సిబ్బందిలో అసహనానికి దారితీసింది. తమపై టీడీపీ నేతల దర్పమేమిటని అధికారులు, సి బ్బంది మనోవేదన పడుతున్నారు. మైనార్టీకి చెందిన మండలస్థాయి అధికారిని పట్టుకొని కార్యాలయంలో టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు దూషించడంతో తోటి సిబ్బంది, ఉద్యోగులు మనసులు చివుక్కుమ న్నాయి. నేతల వైఖరిపై అదే పార్టీలో విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ముస్లిం అధికారి పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారుతోంది.
ఆ కార్యదర్శికి మెమో ఇవ్వడమే కారణమా?
రూరల్ పరిధిలోని ఓ పంచాయతీ హద్దులోకి వచ్చే రైల్వేకోడూరు రహదారిలోని ఒక కమర్షియల్ భవనాన్ని రెసిడెన్సీగా చూపిన ఆరోపణలపై విజయవాడలోని సంబంధితశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. అక్కడి నుంచి విచారణ చేయాల్సిందిగా సదరు మండల అధికారికి ఆదేశం వచ్చింది. ఈ విషయంపై సంబంధిత పంచాయతీ కార్యదర్శికి మోమో ఇచ్చారు. ఈ కార్యదర్శి గత కొన్నేళ్లు ఆ పంచాయతీని పట్టుకొని వేలాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల పదోన్నతి వచ్చినా నిరాకరించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆమెకు అధికారపార్టీ నేతలు అండగా నిలిచారనే విమర్శలున్నాయి. ఈమెకు మెమో రావడంతో పచ్చనేతలకు కోపం వచ్చింది. అంతే తడవుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి, ఆ అధికారిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఆ మైనార్టీ అధికారి నిశ్చేష్టుడయ్యారు.
గతంలో దళిత కమిషనరుపై..
రాజంపేట మున్సిపాలిటిలో దళిత కమిషనరు రాంబాబుపై కూడా పచ్చనేతలు గతంలో వీరంగం సృష్టించా రు. బాత్‌రూంలో పెట్టి గడియ వేశారు. ఆయన ఏకంగా పచ్చనేతలపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే ఈ లోపే అనారోగ్యం పాలుకావడంతో దీర్ఖకాలిక మెడికల్ లీవ్‌లో వెళ్లిపోయారు. ఇప్పుడు రాజంపేటలో అధికారులపై టీడీపీ నేతల పెత్తనం పెరిగిపోవడంతో, అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు. కాగా, టీడీపీ నేతల దౌర్జన్యాలు జరుగుతున్న క్రమంలో అధికారులకు అండగా నిలబడే సంఘాలు కూడా కనుచూపు మేరలో లేవన్నది నిష్ఠూర సత్యం.


