గ్రంథాలయాలకు రూ.45.35 లక్షలు
వేంపల్లె : ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.45.35లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాను ప్రకాష్ తెలిపారు. గురువారం ఆయన వేంపల్లెలోని శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాల్లో మెరుగైన వసతులు కోసం దాతల సహకారంతో అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న కేంద్ర గ్రంథాలయ భవనాన్ని నిర్మించేందుకు రూ.3.50 కోట్లు అవసరమని తెలిపారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చించి భవన నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మునగల చంద్ర, శాఖ గ్రంధాలయ అధికారిణి వనజ కుమారి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రామముని రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


