స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ భేష్
కృష్ణా, బాపట్ల కలెక్టర్ల ప్రశంసలు
కడప సెవెన్‌రోడ్స్ : సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉందని కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డాక్టర్ వి.వినోద్ కుమార్‌లు కొనియాడారు.రాష్ట్రానికే ఆదర్శవంతంగా జిల్లాలో అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురువారం జిల్లాకు వచ్చిన ఆయా కలెక్టర్లు స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్వహణ అద్భుతంగా ఉందని, జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి ఆలోచన ప్రశంసనీయమని, చక్కటి టీమ్ వర్కుతో ముందుకు వెళుతున్న జిల్లా అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ల నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కృష్ణా, బాపట్ల జిల్లా కలెక్టర్లకు క్షుణ్ణంగా వివరించారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ప్రస్తుతం సీకే దిన్నెలో 2, జమ్మలమడుగులో 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ల ద్వారా డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 132 పాఠశాలలకు చెందిన 10,512 మంది విద్యార్థులకు 13 ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్‌లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంటు నీటినే వంటకు ఉపయోగించడం జరుగుతోందన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రానున్నాయనని వివరించారు. గతంలో సాధారణ వంట నిర్వాహకుల ద్వారా వంట వండటం, ప్రస్తుతం స్మార్ట్ కిచెన్ల ద్వారా వంట తయారీకి గల వ్యత్యాసాలను, విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి అందుతున్న అశేష ఆదరణ వంటి వివరాలను తెలియజేశారు.
స్మార్ట్ కిచెన్ షెడ్ల పరిశీలన
అంతకు ముందు గురువారం ఉదయం ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల అభివృద్ధిలో భాగంగా కలెక్టర్ వినూత్న ఆలోచనతో పైలెట్ ప్రాజెక్టుగా అమలులోకి తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్వహణ తీరును కృష్ణా, బాపట్ల జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, వి. వినోద్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించారు. సీకేదిన్నె తదితర చోట్ల పర్యటించారు. అక్కడి వంట నిర్వాహకులను పలకరించగా ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం శుచి, రుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించగలుగుతున్నామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సులభంగా వంటను పూర్తి చేయగలుగుతున్నామని వంట సిబ్బంది తెలిపారు. తమ జిల్లాల్లో కూడా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారు. కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఈవో షంషుద్దీన్, డీఆర్డీఏ ఏపీడీ ప్రసాద్, సంబందిత శాఖల అధికారులు, ఎస్‌ఎస్‌ఏ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


