నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తారా!
అభివృద్ధి పేరిట... కోట్లు కొట్టేయాలని చూస్తున్నారు
ప్రొద్దుటూరు క్రైం: నోటీసులు ఇవ్వకుండా.. చట్టపరమైన విధానాలు లేకుండా రైతుల పొలాలు ఎలా తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. మండల పరిధిలోని చౌడూరు గ్రామంలో రైతుల పొలాల చదును కార్యక్రమాన్ని అడ్డుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చౌడూరు గ్రామంలోని 30 మంది రైతులు 50 ఏళ్ల నుంచి పొలాలను సాగు చేసుకుంటున్నారన్నారు. అటవీప్రాంతాన్ని తలపించేలా ఎడారి కొండల్లా ఉన్న ఈ భూములను రైతులు రూ. లక్షలు వెచ్చించి బోర్లు వేసుకొని మోటర్లను ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కూటమి నాయకులు ఈ భూముల్ని ఏపీఐఐసీకి అప్పగించారన్నారు. పెన్నానది ఒడ్డున మునకకు అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు అన్యాయంగా రైతులను గెంటేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి రైతులు నీటి తీరువా పన్ను, భూమిశిస్తు పన్ను కట్టారని చెప్పా రు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారని, ప్రభుత్వం వారికి ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని రాచమల్లు స్పష్టం చేశారు. రైతుల నుంచి పొలాలను తీసుకునే పద్ధతి సరిగా లేదన్నారు. నోటీసులు ఇస్తే రైతులు కోర్టుకు వెళ్తారనే భయం టీడీపీనేతల్లో ఉందన్నారు.
సమీప గ్రామాలతో పాటు
ప్రొద్దుటూరు మునకకు గురయ్యే ప్రమాదం
రైతులు సాగు చేసుకుంటున్న ఈ భూములు పెన్నా నదికి చౌడూరు గ్రామానికి మధ్యలో ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయని రాచమల్లు అన్నారు. ఈ ఎత్తైన ప్రాంతం వరద నీరు గ్రామంలోకి వెళ్లకుండా రక్షణగా ఉందని చెప్పారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టి పొలాలను చదును చేస్తే భవిష్యత్ కాలంలో చౌడూరు, రంగసాయపల్లె, శంకరాపురం గ్రామాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. శంకరాపురం గ్రామం సమీపంలో ఉన్న మడూరు కాలువలో వరద నీరు కలిసే అవకాశం ఉందని, తద్వారా ఆ నీరంతా ప్రొద్దుటూరు పట్టణంలోకి వెళ్లి జలమయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి, సమీప భూములకు సాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు.
● వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబులరెడ్డి, నాయకులు పల్లా లక్ష్మినారాయణరెడ్డి, సాంబశివారెడ్డి, మోపూరి సిద్ధయ్య, బోరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రసాద్‌యాదవ్, రైతులు పాల్గొన్నారు.
పేరుకే ఈ ప్రాంతంలో కూటమి నాయకులు అభివృద్ధి పనులు చేస్తున్నారని, దాని వెనుక అసలు రహస్యం దాగి ఉందని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసిందని, నాసిరకం పనులు చేసి అందులో రూ.4–5 కోట్లు కొట్టేయాలని ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డిలు పన్నాగం పన్నారని ఆరోపించారు. అంతేగాక నిర్మాణాల పేరుతో ఇక్కడున్న ఇసుకను, నల్ల మట్టిని విక్రయించుకొని రూ. కోట్లాది రూపాయలు లబ్ధి పొందాలనేది వారి దురాలోచన అని రాచమల్లు ఆరోపించారు. రైతులకు న్యాయం చేసేంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పారు.


