20న ఎస్‌హెచ్‌జీ కుటుంబాలకు జాబ్‌మేళా
కడప సెవెన్‌రోడ్స్: ఎస్‌హెచ్‌జీ కుటుంబాలలోని నిరుద్యోగ యువత కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వారి ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్దేశించిన ఒక కుటుంబం– ఒక వ్యాపారవేత్త లక్ష్యానికి అనుగుణంగా మెప్మా సంస్థ ఎస్‌హెచ్‌జీ సభ్యుల కుటుంబ సభ్యులకు వారికున్న ఆసక్తి, అనుభవం, నైపుణ్యం ఆధారంగా రుణ ఆధారిత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం జాబ్ మేళాల నిర్వహణలో విశిష్ట అనుభవం ఉన్న ‘నిపుణ– హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ’తో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుని జాబ్ మేళాలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలను సంఘ సభ్యుల కుటుంబాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. ఈ నెల 20న కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ మునిసిపల్ హైస్కూల్‌లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పలు అంశాలను తెలియజేశారు.
5జీ ఫోన్లతో సమర్థంగా సేవలు
మహిళా శిశు సంక్షేమ శాఖలో సమర్థవంతంగా సేవలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయుక్తం అవుతాయని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలకు సరఫరా చేసిన ‘శాంసంగ్ 5జీ‘ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కడప జిల్లాకు సంబంధించి 2494 మందికి 5ఎ మొబైల్స్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


